వరుస భూకంపాలతో తైవాన్ అతలాకుతలం

తైవాన్ దేశం వరుస భూకంపాలతో అతలాకుతలం అయింది. కేవలం మూడు రోజుల్లో మూడు సార్లు భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం తైవాన్ దేశంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సీస్మాలజీ సెంటరు తెలిపింది.
 
భూకంపం కేంద్రం 2 కిలోమీటర్ల లోతులో ఉందని సీస్మాలజీ సెంటర్ అధికారులు చెప్పారు. తైవాన్‌లోని హువాలియన్ కౌంటీలోని యులిలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పెద్ద భవనం కూలిపోయింది.  కూలిపోయిన భవనంలో నుంచి నలుగురిని రక్షించారు.భూకంపం వల్ల పలు రైళ్లు పట్టాలు తప్పాయి.
 
భారీ భూకంపంతో పలు భవనాలు కుప్పకూలాయి. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక రైలు ఆట బొమ్మలా కదిలింది. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు ధ్వంసమయ్యాయి. గత 24 గంటల్లో 12 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో వందల మంది సైనికులు పాల్గొన్నట్టు వెల్లడించారు.
 
భూకంపం వల్ల పర్వత రహదారులు మూసుకు పోయి 600 మంది చిక్కుకుపోయారు.భూకంపం కారణంగా ఒకరు మరణించారని,మరో 146 మంది గాయపడ్డారని తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది. తూర్పు తైవాన్‌లోని డోంగ్లీ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ పై కొంత భాగం కూలిపోవడంతో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
భూకంప బాధితుల కోసం విప‌త్తు నిర్వ‌హ‌ణ కేంద్రం ఏర్పాటు చేశామ‌ని తైవాన్ అధ్య‌క్షురాలు సాయ్ ఇంగ్‌వెన్ తెలిపారు. మ‌రిన్ని భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించే అవ‌కాశం ఉన్నందున అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.
 
భూకంపం ప్ర‌భావంతో జ‌పాన్‌లోని ఒక రైల్వే స్టేష‌న్‌లో నిలిచి ఉన్న రైలు కుదుపుల‌కు గురైన వీడియోలు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ అయ్యాయి. ఆదివారం మ‌ధ్యాహ్నం 2.44 గంట‌ల‌కు భూకంపం సంభ‌వించిన‌ట్లు రాయిట‌ర్స్ పేర్కొంది.  రాజధాని తైపీలో కొద్దిసేపు భవనాలు కంపించాయి. 2016వ సంవత్సరంలో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు.
గ‌తంలో 1999 సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన భూకంప తీవ్ర‌త 7.6 కాగా, నాడు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  తైవాన్‌కు స‌మీపంలోని దీవుల్లో సునామీ ముప్పు పొంచి ఉంద‌ని జ‌పాన్ వాతావ‌ర‌ణ సంస్థ ప్ర‌క‌టించింది. చైనాలోని ఫుజియాన్‌, గ్వాంగ్‌డాంగ్‌, జియాంషు, షాంఘై కోస్తా తీర ప్రాంతాల్లోనూ భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయ‌ని చైనా భూకంప నెట్‌వ‌ర్క్ కేంద్రం ప్ర‌క‌టించింది.