సాజిద్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డు

పాకిస్థాన్ లో గల లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో  చైనా అడ్డుకుంది. లష్కరేలో అగ్రస్థాయి దళనేత అయిన 2008 నవంబర్ 26వ తేదీ ఉగ్రదాడులలో ప్రధాన సూత్రధారి.  ఈ పేల్లుళ్లలో 175 మంది చనిపోగా, 291 మంది గాయపడ్డారు. సాజిద్ మీర్‌ను నిషేధ జాబితాలో చేర్చాలని, గ్లోబల్ టెర్రరిస్టు గా ప్రకటించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనికి భారతదేశం మద్దతు పలికి సహ ప్రతిపాదనకర్తగా నిలిచింది. భద్రతా మండలిలో ఇతర దేశాలు కూడా దీనిని బలపర్చాయి.

అయితే చైనా తనకు ఉన్న మండలి సభ్యత్వ అధికారాలతో ఈ ప్రతిపాదనను అడ్డుకుని అమలులోకి రాకుండా తొక్కిపెట్టింది. 2008 ముంబై పేల్లుళ్ల కేసులో సాజిద్ మోస్ట్‌వాంటెడ్‌గా ఇండియా ప్రకటించింది. ఈ వ్యక్తి అంతర్జాతీయ ప్రయాణాలపై, వివిధ కార్యకలాపాలపై పూర్తిస్థాయి నిషేధం అవసరం అని ప్రతిపాదనలో తెలిపారు.

భారత్‌లో లష్కరే తోయిబా వ్యవహారాల ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తూ, ముంబైలో దారుణకాండకు బాధ్యుడైన వ్యక్తిని చట్టపరమైన విచారణ తదనంతర శిక్షలకు గురి చేయాల్సి ఉంటుందని భారతదేశం పలుసార్లు డిమాండ్ చేసింది. ప్రతిపాదనను చైనా హోల్డ్‌లో పెట్టడంతో సాజిద్ గ్లోబల్ టెర్రరిస్టు అయ్యేందుకు మరింత జాప్యం అవుతుంది.

యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్‌లోని ఆల్‌ఖ‌యిదా సాంక్ష‌న్స్ క‌మిటీ 1267 ప్ర‌కారం సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాల‌ని అమెరికాతో పాటు భార‌త్ డిమాండ్ చేసింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించి, అత‌ని ఆస్తుల‌ను సీజ్ చేయాల‌ని, ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అమెరికా, ఇండియాలు పలువురు ఉగ్రవాదులపై ఆంక్షల విషయంలో ఐరాసలో చేస్తున్న ప్రయత్నాలకు తరచూ చైనా అడ్డుపుల్లలు పడుతున్నాయి.

గడిచిన కొద్ది నెలల్లో లష్కరేకు చెందిన అబ్దుల్ రెహ్మన్ మక్కి, అబ్దుల్ రౌఫ్ అజర్ (ఈ వ్యక్తి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు)ను కూడా చైనా గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలోకి రాకుండా చేసింది. భారత్ అమెరికాల సిఫార్సు పలు సభ్య దేశాల మద్దతు దక్కినా చైనా తన వీటోతో నిలిపివేసేలా చేసింది.