గ‌వ‌ర్న‌ర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఫిర్యాదు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషా భాయి ఆదివారం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను కలసి ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే తన భర్తపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని, వీటిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్‌కు ఉషాభాయి వినతిపత్రం చేశారు.
 
తన భర్తపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ సతీమణి గతకొద్దిరోజులుగా న్యాయం చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌‌తో పాటు అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు వంద కేసులు తన భర్తపై లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని స్పష్టం చేశారు.
 
రాజాసింగ్ ప్రస్తుతం పీడీయాక్ట్ కింద చర్లపల్లి జైల్లో ఉన్నారు. ప్రభుత్వం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని, దాన్ని ప్రశ్నించిన రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని రాజాసింగ్ సతీమణి తెలిపారు. ఉషాభాయితో పాటు ఒకరిద్దరు మహిళలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.