జన ఔషధీ కేంద్రాలను ప్రజలకు చేరువ చేయండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం నేపథ్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న‘‘సేవా పక్షం’’ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్ గిరిలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్థానిక నేతలు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలను ఆదివారం  ప్రారంభించారు.   

బీజేపీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, డాక్టర్ శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్, హెల్త్ క్యాంపులను ప్రారంభించారు. పలువురు మెడిసిన్ పంపిణీ చేశారు. హెల్త్ చెకప్ చేసిన పలువురు రోగులకు తగిన పరీక్షలు నిర్వహించిన అనంతరం మందుల పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన ఔషధీ కేంద్రాలను పేద, మధ్య ప్రజలందరికీ చేరువ చేయాలని కోరారు. ఈ విషయంలో మాజీ సైనికోద్యోగుల విభాగం నాయకుడు, మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి పేదలకు అత్యంత తక్కువ ధరకు మందులను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు.
 
దేశ వ్యాప్తంగా 8,831 జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో 150 జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే, బీజేపీ కార్యకర్త మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలే 22 కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో కేవలం మల్కాజిగిరి నియోజక వర్గంలోనే దాదాపుగా 10 కేంద్రాలు ఏర్పాటు చేసి సగటున ప్రతి రోజు 55 వేల మంది రోజువారీ మందులు కొనుక్కునేలా జన ఔషధీ కేంద్రాల సేవలను విస్తరించారని అభినందించారు.
 
సఫిల్ గూడలో ‘బస్తీ సంపర్క్ అభియాన్’

 
కాగా, సఫిల్ గూడ ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెబుతూ దేశవ్యాప్తంగా 75 వేల ఎస్సీ గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు.  తెలంగాణలో ఈ కార్యక్రమం ద్వారా 5 వేల ఎస్సి కాలనీలను సందర్శించి, వారి సమస్యలను తెలుసుకోనున్నామని చెప్పారు.  వారికి కేంద్రం ఏం చేస్తుందో వివరించనున్నామని, నవంబర్ 26 వరకు ‘బస్తీ సంపర్క్ అభియాన్’ కార్యక్రమం జరగనుందని చెప్పారు.
 
దళితులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నది భారతీయ జనతా పార్టీనే అని స్పష్టం చేస్తూ కేంద్రంలో 12 మంది దళిత ఎంపీలను మంత్రులను చేసిన ఘనత బిజెపి దే అని గుర్తు చేశారు.  దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చింది? అని ప్రశ్నించారు.
 
 కరోనా సమయంలో పేదలను ఆదుకున్న ప్రభుత్వం మోదీ  ప్రభుత్వం అని చెబుతూ  ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. దళిత వ్యతిరేకి కేసీఆర్ అని పేర్కొంటూ ఆయన చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని హెచ్చరించారు.
 
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ దళిత ద్రోహి అంటూ తాను మాత్రం 100 రూంల ఇల్లు కట్టుకున్నాడని, కోట్లు దండుకుంటున్నాడని సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ను తెలంగాణ పొలిమేర దాకా తరిమికొట్టండని పిలుపిచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపి పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండని అభ్యర్ధించారు.