`ఆపరేషన్ పోలో’తో పటేల్ ముందు లొంగిపోయిన నిజాం 

హైదరాబాద్‌ సంస్థానంలో దారుణాలు, విమోచనం- 3
అందేం రాంరెడ్డి, 

బిజెపి రాష్ట్ర మీడియా కమిటీ సహకన్వీనర్‌

 
యార్‌జంగ్‌ తర్వాత అంచలంచెలుగా ఎదిగిన ఖాసిం రజ్వీ ఎంఐఎంను తన గుప్పిట్లోకి తీసుకొంటూ ముస్లింలను మతపరంగా ఎంతో రెచ్చగొట్టాడు. ఒకచేత్తో ఖురాన్‌ను, మరో చేత్తో కరవాలాన్ని పట్టుకొని జిహాద్‌ కోసం ముందుకు సాగాలని భారతదేశంలోని నాలుగున్నర కోట్ల ముస్లింలంతా మీ వెంట నడుస్తారని సంస్థాన ముస్లింలనురెచ్చగొట్టాడు.  మార్చి 31 నుంచి వారం రోజుల పాటు రజ్వీ ఆయుధ సప్తాప్‌ నిర్వహించాడు. భారతదేశం నడిబొడ్డున ఏ విదేశీ రాజ్యాన్ని తాము అంగీకరించబోమని నెహ్రూ, పటేల్‌ తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్‌ను పరిపాలిస్తున్నది నిజామా, ఖాసిం రజ్వీనా అని ప్రశ్నించారు.
 
భారత యూనియన్‌ హైదరాబాద్‌ను గనక విలీనం చేసుకుంటే కోటిన్నర మంది హిందువులను ఊచకోత కోస్తానన్నాడు రజ్వీ. అదేజరిగితే నిజాం అతడి వంశ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదంలో పడుతుందని, ఏవిధంగానైనా హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం కావల్సిందేనని, మా రక్తంతోటి, స్వేదంతోటి నిర్మించుకున్న భారత యూనియన్‌ అస్తిత్వాన్ని సవాల్‌ చేసే ఏ భాగాన్ని ఇక్కడ కొనసాగించేది లేదని, ఇదంతా స్నేహపూర్వకంగా జరగాలని కోరుకుంటున్నామని పటేల్‌ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. 
 
హైదరాబాద్‌ గనక స్వతంత్ర ప్రతిపత్తి కోరుకుంటే అది ఖచ్చితంగా విఫలమవుతుందని లాయక్‌ అలీకి తేల్చి చెప్పాడు. ఖాసిం రజ్వీ తన భావోద్వేగ మతోన్మాద ప్రసంగాలతో ఎప్పటికప్పుడు ముస్లింలను రెచ్చగొడుతూ ఎంఐఎం బలాన్ని నిరంతంరం పెంచుతూ సంస్థానంలోని హిందువులకే కాకుండా నిజాంకు కూడా ఒక సవాల్‌గా మారాడు. 
 

‘‘వెయ్యేండ్ల తరువాత అధికారం మళ్లీ భారత యూనియన్‌ చేతిలోకి వచ్చింది. అయితే వారికి పరిపాలించే యోగ్యత కానీ, సామర్థ్యం కానీ లేవు. ఈ అసమర్థత వల్లే వాళ్లు ముస్లింలకు లొంగి ఒకనాడు అధికారాన్ని అప్పగించారు. హైదరాబాద్‌ను సామంత రాజ్యం చేసుకోవడానికి వాళ్లు అనుసరిస్తున్న బలాత్కార పద్దతులు వారి కోమటితత్వానికి నిదర్శనం. ఒర నుండి తీసిన కత్తి ఒక్కటే వారికి జవాబు.. సోదరులారా గమ్యాన్ని చేరేవరకు ఆగకండి.’’ ఈ విధంగా ఖాసిం రజ్వీ తన అహంకారపూరిత మతోన్మాద ప్రేలాపనతో ముస్లింలను ఒక సైన్యంలా తయారు చేశాడు.

 

బంగాళాఖాత జలాలు నిజాం ప్రభుత్వ పాదాలు కడుగుతాయని దత్తమండలాలు తిరిగి త్వరలోనే హైదరాబాద్‌ సొంతమవుతాయని రజ్వీ అంటుంటే భారత ప్రభుత్వం పదేపదే అభ్యంతరం తెలిపింది. రజాకార్‌ అంటే వాలంటీర్‌ అని అర్థం. ఆ వాలంటీర్ల దళానికే రజాకార్లని పేరు. ఇది రజ్వీ హయాంలో ఆయుధ శిక్షణతో ఉన్మాద సైన్యంగా మారింది. 
 
రజాకార్లకు తుపాకులను, యూనిఫాంలను ఇచ్చి ప్రజలను హడలగొట్టి అణచివేసే సంకల్పంతో నగరవీధులలో పరేడ్‌ చేయించారు. 1947 నవంబర్‌ 3 నాటికి రజాకార్ల సంఖ్య 50వేలు దాటింది. ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచనున్నట్టు ఖాసిం రజ్వీ ప్రకటించాడు. 1941 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం సంస్థానంలో 21 లక్షల మంది ముస్లింలు, కోటి 32 లక్షల మంది హిందువులు, 10 లక్షల మంది ఇతరులు ఉన్నారు. 
 

జిహాద్‌తో బెదిరించి 50లక్షల మంది హిందువులను ఈ ప్రాంతం వదిలివెళ్లేలా చేసి, హిందువులలో 30 లక్షలకు పైగా ఉన్న హరిజనులను ముస్లింలుగా మార్చి దిగుమతి అయ్యే ముస్లింలను కలిపి ముస్లింల సంఖ్య కోటి దాటించవచ్చని భావించారు. ఆ విధంగా హైదరాబాద్‌ సంస్థానాన్ని ముస్లిం బహుళ సంస్థానంగా మార్చి స్వతంత్ర రాజ్యంగా నడిపించవచ్చని, అందుకోసమే ఏడాది పాటు యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్నామని నిజాం భావించాడు.

 

దారుణంగా హిందువులపై అత్యాచారాలు  ఆగస్టు 15 తర్వాత 13 నెలల పాటు హిందువులపై జరిగిన అత్యాచారాలు అత్యంత దారుణమైనవి. తెలంగాణ, మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాలలో వందలాది గ్రామాలలో, వేలాది మంది హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపి, వందలాది మానభంగాలు చేసి, వేలాది మందిని గాయపరచి అత్యంత భయానకంగా రాక్షసత్వంగా దాడులు, దుర్మార్గాలతో మారణహోమం సృష్టించారు. 
 
భారత ప్రభుత్వం నిరంతరం హెచ్చరిస్తున్నా ఈ దాష్టీకాన్ని కొనసాగించారు. కమ్యూనిస్టులు మొదట నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరపినప్పటికీ ఫిబ్రవరి 1948 కలకత్తా సమావేశాల తరువాత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయమని దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణలో యూ టర్న్‌ తీసుకొని రజాకార్లకు అనుకూలంగా మారి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 
 
హఠాత్తుగా కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తివేత 
 
అందుకే నిజాం సర్కార్‌ కమ్యూనిస్టు పార్టీపై 1943లో విధించిన నిషేధాన్ని హఠాత్తుగా ఎత్తేసింది. ‘జద్నేవ్‌లైను’, ‘ఇంర్నేషనల్‌ స్టాలినిజం’, ‘కలకత్తా థిసిసీ’ లాంటి తిక్కతిక్క వాదనలతో దేశద్రోహకరంగా కమ్యూనిస్టులు తమ సహజ గుణాన్ని ఈ
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో కూడా ప్రదర్శించారు. 
 
క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో కూడా కమ్యూనిస్టులు బ్రిటిష్‌ ఏజెంట్లుగా పని చేస్తూ స్వతంత్రోద్యమ నాయకులను బ్రిటిష్‌ వారికి పట్టించారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ సైన్యంతో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నేతాజీని జపనీస్‌ ఆర్మీ కుక్కలాగా అత్యంత అవమానకరంగా చిత్రిస్తూ తమ పత్రిక పీపుల్స్‌ వార్‌లో కర్టూన్‌లు కూడా వేశారు. 
 

ఈ విధమైన ఆలోచనలతోనే పశ్చిమ బెంగాల్‌ నుంచి ఆయుధాలు తెప్పించి హైదరాబాద్‌ సంస్థానం రజాకార్లకు అందించారు. చివరి ఆరు నెలల నిజాం పరిపాలనలో హైదరాబాద్‌ సంస్థానంలోని హిందువులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులు ఇటు రజాకార్ల దారుణాలకే కాకుండా కమ్యూనిస్టుల దురాగతాలకు కూడా బలయ్యారు. పగలు రజాకార్లు దోచుకుంటే రాత్రిళ్లు కమ్యూనిస్టులు దోచుకునేవారు.

 

రజాకార్లు చేసిన దారుణాలలో వేలాది మందిని చంపడం, వందలాది మానభంగాలే కాకుండా మహిళలను నగ్నంగా బతుకమ్మలాడిరచారు. రజాకార్ల దారుణాలకు బలైన గ్రామాలలో కొన్ని భైరాన్‌పల్లి (తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌), గుండ్రాంపల్లి, పరకాల, పాతర్లపాడు, కూటిగళ్లు, బీబీనగర్‌, దైపాల్‌, మన్మద్‌, కోడ్గావ్‌, కంఠేశ్వర్‌, ముద్కేడ్‌, చోర్పర్వ, మ్లేజ్‌, మూటకొండూరు, వర్ధమానకోట, కోటగొండ, మీనవోళ్లు, రేణిగుంట (భువనగిరి), అంకనూరు, కొనపాక, చౌటపల్లి, కొడకండ్ల, బోరవెళ్లి, ఎర్రుపాలెం, అష్రఫ్‌పేట, గంగాపూర్‌ లాంటి వందలాది గ్రామాలున్నాయి.

 

పత్రికలు
హైదరాబాద్‌ సంస్థానంలో ఏవో కొన్ని పత్రికలు మినహా తతిమావన్నీ మత విద్వేషాన్ని, పాక్‌ అనుకూలతను ప్రదర్శిస్తూ వచ్చాయి. డెక్కన్‌ క్రానికల్‌, గోల్కొండ పత్రిక, ఆర్యభాను, ముషీరే దక్కన్‌, మహిబ్బవతన్‌, రయ్యత్‌, ఇమ్రోజ్‌ పత్రికలు మాత్రం నిష్పక్షపాతంగా వార్తలు, వ్యాఖ్యలు ప్రచురించేవి. 
 

ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ నిజాం, రజ్వీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కలం ఎత్తి ఎంతో సాహసోపేతంగా నిష్పక్షిక జర్నలిజాన్ని బ్రతికిస్తూ నిర్భాగ్యులకు రక్షణగా నిలుస్తూ తన ప్రాణాన్ని తృణ ప్రాయంగా సమర్పించారు. షోయబుల్లాఖాన్‌ 1857లో జరిగిన స్వతంత్ర పోరాట సమయంలో అశ్వకుల్లాఖాన్‌, హజ్రత్‌ బేగం, తుర్రేబాజ్‌ఖాన్‌ లాగా దేశభక్తిని, మానవత్వాన్ని ఉన్నత స్థాయికి ఎత్తుతూ ప్రాణాలర్పించారు.

 

21 జూన్‌ 1948న మౌంట్‌ బాటన్‌ స్వదేశానికి పయనమై వెళ్లిపోయాడు. సీ.రాజగోపాలా చారి గవర్నర్‌ జనరల్‌ అయ్యాడు. నిజాం ప్రభుత్వం పాకిస్తాన్‌ నుంచి మరికొన్ని ఇతర దేశాల నుంచి ఆయుధాలను సేకరించింది. సిడ్నీ కాటన్‌ అనే ఆస్ట్రేలియన్‌ జాతీయుడు ఇందులో ముఖ్య భూమిక పోషించాడు. 
 
చివరి దశలో హైదరాబాద్‌ సంస్థానంలో సాయుధ రజాకార్ల సంఖ్య 2 లక్షలకు చేరింది. ప్రభుత్వ దళాలు 42 వేలకు పైగా ఉండనే ఉన్నాయి. చర్చలే ఆగిపోయాయి. సైనిక చర్య తప్పనిసరని భారత ప్రభుత్వ భావించింది. దీనిపై ప్రభుత్వం సెప్టెంబర్‌ 9న నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సదరన్‌ కమాండ్‌కు తెలియచేశారు. 
 
`ఆపరేషన్ పోలో’కు పటేల్ ఆదేశాలు 
 
అదను కోసం ఎదురు చూస్తున్న సర్దార్‌ పటేల్‌కు సెప్టెంబర్‌ 12, 1948న జిన్నా మరణం ఒక సదవకాశంగా లభించింది. సెప్టెంబర్‌ 13 తెల్లవారుజాము ఆపరేషన్‌ పోలోకు ఆదేశాలందాయి. లెఫ్టినెంట్‌ జనరల్‌ మహరాజ రాజేంద్ర సింగ్‌ నిర్దేశకత్వంలో మేజర్‌ జనరల్‌
జె.ఎన్‌.చౌదరి నాయకత్వాన ఈ పోలీస్‌ చర్య జరిగింది.
 
 బొంబాయి సెక్టర్‌లో కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎల్‌.ఎస్‌.బ్రార్‌, మద్రాస్‌ సెక్టర్‌లో ఆపరేషన్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఏ.ఏ.రుద్ర, బేరర్‌ సెక్టర్‌లో బ్రిగేడియర్‌ శివదత్‌ సింగ్‌ ఆయనకు సహకరించారు. ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ముఖర్జీ కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించారు. యూనియన్‌ సేనలు మొత్తం 8 విభిన్న ప్రాంతాల నుంచి సంస్థానాన్ని ముట్టడిరచాయి. 
 
అయితే ప్రధానమైన ముట్టడి వాయువ్యాన షోలాపూర్‌ నుంచి, ఆగ్నేయాన బెజవాడ నుంచి జరిగాయి. భారత సేనల వ్యూహమేంటో
నిజాం సైన్యానికి అంతుపట్టలేదు. ఎర్రకోట మీద అసఫ్‌ జా పతాకాన్ని ఎగరేస్తామని బీరాలు పలికినవారు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. 
 
భారత సేనలు వెంట తెచ్చిన ఆధునాతన శకటాలు, యుద్ధ విమానాలను చూసి నిజాం సైన్యం పూర్తిగా స్థైర్యం కోల్పోయాయి. చాలాచోట్ల నిజాం సైనికులు రజాకార్లు ఆయుధాలు పారేసి పారిపోయారు. కొన్ని చోట్ల తికమకతో స్వపక్షం మీదే కాల్పులు జరుపుకొన్నారు. మునగాల, మరికొన్ని ప్రాంతాలల స్వల్ప ప్రతిఘటన ఎదురైంది. వరంగల్‌, బీదర్‌ విమానాశ్రయాల్లో బాంబింగ్‌ దాడి జరిగింది. 
 
పిరికిపందలు కొన్ని చోట్ల రోడ్డు బ్రిడ్జిలను, ఇతర కమ్యూనికేషన్లను ధ్వంసం చేశారు. నాలుగు రోజుల్లోనే నిజాం సేనల, రజాకార్ల ప్రతిఘటన దాదాపు పరిసమాప్తమైంది. సెప్టెంబర్‌ 17న ఉదయం నిజాం సైన్యాధిపతి ఇద్రూస్‌ వచ్చి కే.ఎం.మున్షీని లేక్‌వ్యూ అతిథి గృహంలో కలుసుకున్నాడు. 
 
అప్పటి వరకు మొండిగా తిరస్కరించిన లాయక్‌ అలీ మధ్యాహ్నం ఒంటి గంటలకు రాజీనామా చేశాడు. రజాకార్లను నిషేధిస్తున్నామని, భారత సేనలను సికింద్రాబాద్‌కు అనుమతిస్తున్నామని, యుద్ధ విరమణను ప్రకటిస్తున్నామని గవర్నర్‌ జనరల్‌ రాజాజీకి తెలియజేయమని
కే.ఎం. మున్షీని నిజాం ఆర్థించాడు. 
 
సాయంత్రం 7 గంటలకు నిజాం రేడియో ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కే.ఎం.మున్షీతోనూ మాట్లాడిచ్చారు. తదుపరి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 18 జె.ఎన్‌.చౌదరి మిలిటరీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన బావమరిది ఇంట్లో దాక్కున్న ఖాసిం రజ్వీని సెప్టెంబర్‌ 19న అరెస్టు చేశారు. 
 
సెప్టెంబర్‌ 23న నిజాం హైదరాబాద్‌ కేసును ఉపసంహరించుకున్నట్టు భద్రతా మండలికి తంతి పంపారు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు ఎదురొడ్డి ఎన్నో వీరోచిత పోరాటాలు సల్పారు. సర్దార్‌ పటేల్‌ అపర చాణక్యనీతి, దృఢ సంకల్పం, భారత సైన్యం సామర్థ్యం, హైదరాబాద్‌ సంస్థానంలోని హిందువులను రక్షించగలిగాయి. 
 
ఈ సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినంగా చరిత్రలో నిలిచిపోయింది. మహారాష్ట్రలోని మరఠ్వాడాలోను, కర్నాటకలోని హైదరాబాద్‌ కర్నాటకలోనూ ఈ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.  కానీ దురదృష్టం మేమిటంటే మన తెలంగాణలో దుర్మార్గపు రాజకీయాలకు అలవాటు పడిన ఓటుబ్యాంకు రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఈ సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా ఇంతవరకు ఎన్నడూ నిర్వహించలేదు. సెప్టెంబర్‌ 17, 1948 తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్ర దినం.  
 
కావున ఈ సెప్టెంబర్‌ 17న విమోచన దినంగా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి.  కాకతాలీయంగా కలిగిన సంతోషకరమైన విషయమేమిటంటే సెప్టెంబర్‌ 17న మన ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ బంధాన్ని తెలంగాణ ప్రజలంతా గుర్తిస్తారని ఆశిస్తున్నాం.
 
(ముగింపు)