ఐకమత్యంగా ఉంటేనే భారత్ ప్రపంచ శక్తిగా మారుతుంది

భారత్‌కు ప్రపంచ శక్తిగా ఎదిగే సామర్థ్యముందని, అయితే ఐకమత్యంతోటే అది సాధ్యమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ చెప్పారు. ప్రజలంతా సమానమే అని రాజ్యాంగం చెబుతోందని, రామకృష్ణ మఠం కూడా అందరినీ సమానంగా చూస్తోందని ప్రశంసించారు.
 
భారత రత్న భూపేన్ హజారికా రాసిన పాటను ఆయన గుర్తుచేసుకున్నారు. మనుషుల గురించి మనుషులే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని పాట అర్థమని వివరించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా `చట్టం-సమాజం-పౌరుడు’ఆయన  అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌ లో ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
న్యాయమూర్తుల ప్రవర్తనను ప్రపంచం గమనిస్తూ ఉంటుందని, బెంచ్‌పైన ఉన్నా, బయట ఉన్నా ఆదర్శనీయంగా ఉండాలని ఆయన చెప్పారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మధ్య (బార్‌‌కు, బెంచ్‌కు మధ్య) ఆరోగ్యకరమైన సంబంధాలుంటేనే న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. బార్‌, బెంచ్‌ మధ్య పరస్పర గౌరవముండాలని, బార్, బెంచ్ న్యాయవ్యవస్థకు రెండు చక్రాల్లాంటివని చెప్పారు.
 
రాజ్యాంగం సూచించినట్లుగా ప్రజలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని భుయాన్ సూచించారు. వేషభాషలు, కులం, మతం, సిద్ధాంతాలు, ఆలోచనా తీరు వేరే అయినా పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజానికి అవకాశముంటుందని, అలాంటి ఆరోగ్యకరమైన సమాజముంటేనే శక్తిమంతమైన దేశ నిర్మాణం సాధ్యమౌతుందని తెలిపారు.
 
తాను ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న రామకృష్ణ మఠం, మిషన్ కార్యక్రమాలు గమనిస్తూ ఉంటానని, రామకృష్ణ మఠాన్ని సందర్శించినప్పుడల్లా తనకు మనశ్శాంతి, ఆనందం కలుగుతాయని చెప్పారు.   
 
కార్యక్రమానికి అతిథిగా హాజరైన పద్మభూషణ్ పద్మనాభయ్య మాట్లాడుతూ వివేకానంద భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా కులమతాలకు అతీతంగా అందరికీ శిక్షణనిస్తున్నందుకు ఆయన అభినందించారు. విద్యార్ధులకు చదువుతో పాటు నైపుణ్యాల శిక్షణ కూడా అవసరమని చెప్పారు.  
 
ఏ పని చేసినా అత్యుత్తమంగా చేయాలని, చీపురుతో ఊడుస్తున్నా అలాగే చేయాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా లక్షలాది మందికి శిక్షణనిచ్చి తీర్చిదిద్దామని వివరించారు.  కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, న్యాయవాదులు, లా కళాశాలల విద్యార్ధులు, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ, వాలంటీర్లు పాల్గొన్నారు.