షిండే గ్రూపులో చేరిన 12 రాష్ట్రాల `సేన’ చీఫ్‌లు

శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. 12 రాష్ట్రాల సేన అధ్యక్షులు మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరారు. ఈనెల 15న జరిగిన ఒక సమావేశంలో షిండే క్యాంపులో వీరంతా చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి షిండే ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

షిండే గ్రూపులో చేరిన పార్టీ రాష్ట్ర చీఫ్‌ల్లో ఢిల్లీ శివ‌సేన చీఫ్ సందీప్ చౌధ‌రి, మ‌ణిపూర్ శాఖ అధ్య‌క్షుడు టొంబి సింగ్‌, మ‌ధ్యప్ర‌దేశ్ చీఫ్ త‌దేశ్వ‌ర్ మ‌హ‌వ‌ర్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ చీఫ్ ధ‌నంజ‌య్ ప‌రిహార్‌, గుజ‌రాత్ చీఫ్ ఎస్ఆర్ పాటిల్, రాజ‌స్ధాన్ చీఫ్ ల‌ఖ‌న్ సింగ్ ప‌వార్‌, హైద‌రాబాద్ చీఫ్ మురారీ అన్నా, గోవా చీఫ్ జితేష్ కామ‌త్‌, క‌ర్నాట‌క చీఫ్ కుమార్ హ‌క‌రి, బెంగాల్ చీఫ్ శాంతి ద‌త్త‌, ఒడిషా చీఫ్ జ్యోతిశ్రీ ప్ర‌స‌న్న కుమార్‌, త్రిపుర స్టేట్ ఇన్‌చార్జ్ బ‌రివ‌దేవ్ నాధ్ ఉన్నారు.

పార్టీ గుర్తు తమకే చెందాలంటూ షిండే గ్రూపు చేసిన వాదనపై ఎన్నికల కమిషన్‌‌ను మందుకు వెళ్లకుండా చూడాలని కోరుతూ ఉద్ధవ్ థాకరే వర్గం వేసిన పిటిషన్‌ మరో వారంలో సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గత జూన్ 30న ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.