రాహుల్ యాత్ర కు డబ్బులు ఇవ్వలేదని దాడి

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఓ కూరగాయల వ్యాపారిని కొట్టిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు రూ.2 వేలు విరాళమివ్వమని ఓ కూరగాయల వ్యాపారిని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేసారు. కానీ ఆ కూర‌గాయ‌ల వ్యాపారి రూ. 500 మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారిపై కార్యకర్తలు దాడి చేసారు. దుకాణంలోని తూకం యంత్రాల్ని విసిరేశారు. 
 
అక్కడి సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. భార‌త్ జోడో యాత్ర ఫండ్ పేరుతో త‌మ ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు వ‌సూల్ చేస్తున్నార‌ని వ్యాపారి ఆరోపించాడు. క‌స్ట‌మ‌ర్ల‌ను కూడా కార్య‌క‌ర్త‌లు అవ‌మానించిన‌ట్లు అత‌ను తెలిపాడు. 
 
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హెచ్ అనీశ్ ఖాన్ ఆ గ్యాంగ్‌లో ఉన్న‌ట్లు వ్యాపారి ఫ‌వ‌జ్ ఆరోపించాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ  ఇది అల్ల‌రిమూక‌లు చేసిన ప‌ని అని, వారిపై చ‌ర్య‌లు తీసుకున్న్న‌ట్లు తెలిపింది.
ఇక రాహుల్ యాత్ర విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే ప్రజల్లోకి పాదయాత్ర తో వెళ్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 
 
12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు ముందుకు వెళ్తారు. రోజూ రెండు విడతల్లో ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఈ పాదయాత్ర జరగనుంది.