కూనో పార్క్‌లోకి 8 చీతాల‌ను వ‌దిలిన ప్రధాని మోదీ

న‌మీబియా నుంచి తెచ్చిన 8 చీతాల‌ను ఇవాళ ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌లోకి విడుదల చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు ఇవాళ ఉద‌యం చేరుకున్నాయి. ఆ త‌ర్వాత వాటిని ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ల‌లో కూనో ఫారెస్ట్‌కు త‌ర‌లించారు.
 
కాసేప‌టి క్రితం మోదీ ఆ చీతాల‌ను పార్క్‌లోకి విడుద‌ల చేశారు. ప్ర‌ధాని మోదీ ఇవాళ 72వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చీతాల‌ను విడుద‌ల చేశారు. దీంతో భార‌త్‌లో దాదాపు 70 ఏళ్ల త‌ర్వాత చీతాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కూనో జాతీయ పార్క్ ఉంది. 8 చీతాల‌కు రేడియో కాల‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేశారు. వాటిని శాటిలైట్ ద్వారా మానిట‌ర్ చేయ‌నున్నారు. పార్క్‌లో కూడా మానిట‌రింగ్ బృందాల‌ను ఏర్పాటు చేశారు.
 
నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులు మన అతిథులని, కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌ వాటి ఇల్లు అని ప్రధాన మంత్రి మోదీ చెప్పారు. వీటిని తీసుకురావడం కోసం ప్రభుత్వం అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తోందని, దీని వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.
 
స్వాతంత్య్ర అమృతోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో వీటిని తీసుకొచ్చామని, నూతన శక్తితో వీటిని పరిరక్షిస్తామని చెప్పారు.   మన దేశంలో గతంలో ఆసియాటిక్ చిరుత పులులు ఉండేవి. అయితే ఇవి అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం ప్రకటించింది.
 
 దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఈ జాతిని పునరుద్ధరించడం కోసం నమీబియా నుంచి ఎనిమిది చిరుత పులులను తీసుకొచ్చారు. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక దినమని చెప్పారు.  ఫెడోరా టోపీ ధరించిన మోదీ ఒకటవ, రెండవ ఎన్‌క్లోజర్లలోని చిరుత పులులను విడుదల చేశారు.
 
అవి కునో-పాల్పుర్ నేషనల్ పార్క్‌లోకి వెళ్తుండగా ప్రొఫెషనల్ కెమెరాతో ఫొటోలు తీశారు. నమీబియాలోని నిపుణులతో కలిసి మన దేశ శాస్త్రవేత్తలు పని చేశారని, మన శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాకు వెళ్ళారని, అక్కడివారు ఇక్కడికి వచ్చారని వివరించారు. మన దేశంలో వీటికి అనువైన స్థలం గురించి అన్వేషించామని  చెబుతూ బాగా పరిశీలించిన తర్వాత కునో నేషనల్ పార్క్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. 
ప్రతి చిరుత వెనుక ఒక ప్రత్యేక పర్యవేక్షణ బందం ఉంటుంది. వారు 24 గంటల పాటు చిరుతల స్థానాన్ని పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో సంతకం చేసిన ఎంఓయూ కింద చీతాలను తీసుకొచ్చారు. 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలను నేడు పార్క్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ఉన్నారు.
మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు.