వీరోచితంగా ఉద్యమాలు చేసిన ఆర్యసమాజ్

హైదరాబాద్‌ సంస్థానంలో దారుణాలు, విమోచనం- 2

అందేం రాంరెడ్డి, 
బిజెపి రాష్ట్ర మీడియా కమిటీ సహకన్వీనర్‌
హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నిరంకుశ విధానాలను, హిందువులపై అత్యాచారాలను ప్రతిఘటిస్తూ ఆర్యసమాజ్ ఎన్నో ఉద్యమాలను చేసింది. జాతీయ స్థాయి నాయకులు ఆ ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో ప్రవేశించారు. ఉద్యమాలలో వేలాదిమంది సత్యాగ్రాహులు పాల్గొన్నారు. జైలులో వందేమాతరం గీతం పాడినందుకు వావిలాల రామచంద్రరావు (ఈయనే ఆ తర్వాత వందేమాతరం రామచంద్రరావుగా ప్రసిద్ధి చెందారు)ను దావూద్‌ గజదొంగ చేత నిజాం ప్రభుత్వం రాక్షసంగా కొట్టించింది. ఆయన నోట దెబ్బదెబ్బకు వందేమాతరం అన్న నినాదం తప్ప ఇంకేదీ రాలేదు. 
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్లో విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆలపించడాన్ని నిజాం ప్రభుత్వం సహించలేక హిందూ
విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. అయితే నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చి ఆ విద్యార్థులను చేర్చుకుంది. 
 
హైదరాబాద్‌ రాష్ట్రమే 82వేల చదరపు మైళ్ల వైశాల్యం కలిగిన జైలు అని పండిట్‌ నరేంద్రజీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య అక్షర సత్యం. ఆ మాటన్నందుకే పండిట్‌జీకి ఆరు నెలల జైలు శిక్ష పడిరది. ఇది ఆర్యవీరుల కార్యదీక్ష, కర్తవ్యనిష్ఠ, దేశభక్తి. పండిట్‌ నరేంద్రజీని 1938 అక్టోబర్‌ 15న అరెస్టు చేసి, మన్ననూరు జైలులో నిర్బంధించింది. ఆ నిర్బంధం 1940 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఈ ఆర్యసమాజ్‌ నాయకులను పదుల సంఖ్యలో నిజాం తాబేదార్లు హత్యలు చేయించారు.

నిజాం వ్యతిరేక ఉద్యమాలలో ప్రారంభమైన ఇంకొక సంస్థ ఆంధ్ర మహాసభ. తెలుగుకు జరిగిన పరాభవానికి రోసి కొందరు ప్రముఖులు అదే రాత్రి ఒకే చోట సమావేశమై ఆంధ్రా జనసంఘాన్ని స్థాపించారు. మాడపాటి హనుమంతరావు, మందుముల నర్సింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు ప్రభృతులు
జనసంఘ్ సభ్యులు. 
 
ఈ సంఘం ప్రథమ సభ 1922 ఫిబ్రవరి 14న కే.వీ.రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. 1930లో మెదక్‌ జిల్లా జోగీపేటలో జరిగిన సభలో ఆంధ్ర జనసంఘం పేరును ఆంధ్ర మహాసభగా మార్చారు. 1937లో సంస్థానంలోని మహారాష్ట్ర ప్రాంతీయులు మహారాష్ట్ర పరిషత్‌ను, కన్నడిగులు కర్ణాటక పరిషత్‌ను స్థాపించుకున్నారు. 
 
ఆంధ్ర మహాసభ 1941 వరకు మితవాదుల చేతుల్లోనే నడిచింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ సభలో రావి నారాయణరెడ్డి
నాయకత్వంలో కమ్యూనిస్టులు కుట్రతో తమ వశం చేసుకున్నారు. మితవాదులు జాతీయ ఆంధ్ర మహాసభ పేరుతో మరొక సంస్థను స్థాపించారు. కే.వీ.రంగారెడ్డి, బి.రామకృష్ణారావు, మాదిరాజు రామకోటేశ్వరరావు, పి.శ్రీనివాస రావు తదితర ప్రముఖులు దీనికి నాయకులు.

హైదరాబాద్‌ సంస్థానంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు, దాని కార్యక్రమాలలో చెప్పుకోదగిన విషయాలు పెద్దగా లేవు. స్టేట్‌ కాంగ్రెస్‌ మొదటి కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు 1938 సెప్టెంబర్‌ 9న సభ జరపాలని నిర్ణయించగా రెండు రోజుల ముందే నిజాం ప్రభుత్వం కాంగ్రెస్‌ను నిషేధించింది. కాంగ్రెస్‌ పార్టీ పేరు గురించి నిజాంను నమ్మించడానికి నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 
 
కాంగ్రెస్‌ వెంట అతిరథులు, మహారథులు ఉన్నా నిజాం ప్రభుత్వం మెడలు వంచి దారిలోకి తేలేకపోయారు. ఎట్టకేలకు 1946 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌పై నిషేధం తొలగింది. స్వామి రామానందతీర్థ స్టేట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యాడు. మొత్తం మీద స్టేట్‌ కాంగ్రెస్‌ పోలీస్‌ చర్య జరిగిన రోజుల్లో తప్ప పెద్దగా సఫలం కానట్టేలెక్క. రాజకీయ పార్టీల మాట దేవుడెరుగు ఆఖరికి హైదరాబాద్‌ సంస్థానంలో భజన మండళ్లు సైతం నిషిద్ధమే.
 
ద్విజాతి సిద్ధాంత సృష్టికర్తలు 

ద్విజాతి సిద్ధాంత సృష్టికర్తలు, పాకిస్తాన్‌ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిన దుష్టత్రయం 1.ముహ్మద్‌ (అల్లమా) ఇక్బాల్‌ 2.మహ్మద్‌ అలీ జిన్నా 3.చౌదరి రహ్మత్‌ అలీ (కేంబ్రిడ్జి యూనివర్సిటీ). ఈ రహ్మత్‌ అలీ ప్రతిపాదించిన ‘‘ద మిల్లెట్‌ అండ్‌ హర్‌ టెన్‌ నేషన్స్‌’’లో ఎనిమిది భాగాలుగా చిత్రించినవి 1947కు ముందున్న భారతదేశానికి చెందినవి, 
 
మిగిలినవి రెండు భాగాలు శ్రీలంకవి. అవి 1.పాకిస్తాన్‌, 2.హైదరిస్తాన్‌, 3.ఫరూఖిస్తాన్‌, 4.బంగే ఇస్లాం, 5.ముయినిస్తాన్‌, 6.సిద్దిఖిస్తాన్‌, 7.ఉస్మానిస్తాన్‌ (హైదరాబాద్‌ సంస్థాన ప్రాంతం), 8.మప్లస్తాన్‌, శ్రీలంకకు చెందిన మిగిలిన రెండు 9.సైఫిస్తాన్‌ (పశ్చిమ శ్రీలంక), 10.నాజరిస్తాన్‌ (తూర్పు శ్రీలకం). 
 
ఈ విధంగా ద్విజాతి సిద్ధాంతకర్త, పాకిస్తాన్‌ భావజాల ప్రతిపాదకుడు చౌదరి రహ్మత్‌ అలీ ప్రతిపాదించిన ఇస్లాం దేశాలలో మన హైదరాబాద్‌ సంస్థానం ఉస్మానిస్తాన్‌ ఒకటి. ముస్లింలు అల్పసంఖ్యాకులై ఉన్నా సరే పిత్రార్జితం కాబట్టి హైదరాబాద్‌ స్టేట్‌ కూడా స్వతంత్య్ర రాజ్యమై ఉస్మానిస్తాన్‌ కావాలన్నాడు. ఈ ‘‘అబ్బసొత్తు’’ (పిత్రార్జితం) సిద్ధాంతాన్ని ప్రాతిపదికన చేసుకొని ముస్లిం లీడర్లు హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలవనీయకుండా చేయడానికి చేయగలినదంతా చేశారు.

రహ్మత్‌ అలీవి ఎంత మత దురంహకార ఆలోచనలో దీనిని బట్టి తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1946 మార్చి 16న క్యాబినెట్‌ మిషన్‌ భారతదేశానికి వచ్చింది. జైపూర్‌, ట్రావెంకోర్‌లతో పాటు హైదరాబాద్‌ సంస్థానంతోనూ క్యాబినెట్‌ మిషన్‌ చర్చలు జరిపింది. హైదరాబాద్‌ సంస్థానం తరఫున చర్చల్లో పాల్గొన ప్రతినిధి వర్గానికి చటారీ నవాబ్‌ నాయకుడు. 
 
నవాబ్‌ అలీ యార్‌జంగ్‌, నిజాం రాజకీయ సలహాదారు మాంక్‌టన్‌ క్యాబినెట్‌ మిషన్‌లోని సభ్యులను కలుసుకున్నారు. జిన్నాతోనూ వారు సమావేశమయ్యారు. భారత యూనియన్‌తో ఒడంబడికను కుదర్చడంలో హైదరాబాద్‌ సంస్థానానికి తగిన భద్రత ఉండేలా బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశంపై ఒత్తిడి తేవాలని నిజాం ప్రభుత్వం అర్థించింది. 
 
ముస్లిం జనసంఖ్యను పెంచుకోవడం కోసం కాందిశీకులను దిగుమతి చేసుకునే కుట్రకు పాల్పడ్డారు. రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సు జరుగుతున్న రోజుల నుండే ముస్లింల దిగుమతి కుట్రలు సాగుతూ వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల అధ్యాపకుడు అబ్దుల్‌ లతీఫ్‌ జనాభా మార్పిడి జరగాలని ప్రతిపాదించాడు. 
 
హైదరాబాద్‌ స్టేట్‌లోని హిందువులు ఇతర ప్రాంతాలకు వలస పోవాలని, వారి స్థానంలో ఇతర ప్రాంత ముస్లింలు హైదరాబాద్‌ రావాలని, అలా హైదరాబాద్‌ దేశం పూర్తిగా ముస్లిం రాజ్యం అవుతుందని లతీఫ్‌ సూచించాడు. మతం మత్తుమందే కాదు ` విషం కూడా. అదే ముస్లిం లీడర్ల తలకాయలను విషపూరితం చేసింది.

1947 జూన్‌ 3న మౌంట్‌ బాటన్‌ ఒక ప్రకటన చేస్తూ 1947 ఆగస్టు నాటికల్లా భారతీయులకు అధికార మార్పిడి జరుగుతుందన్నారు. భారతదేశంలోని సంస్థానాలకు సంబంధించిన విధానాన్ని మాత్రం క్యాబినెట్‌ మిషన్‌ మెమరాండం ప్రకారం రూపొందిస్తామన్నారు. ఈ ప్రకటనను అనుసరించి 560కి పైగా ఉన్న స్వదేశీ సంస్థానాలన్నీ 1947 ఆగస్ట్‌ నాటికి స్వతంత్య్ర రాజ్యాలు అయిపోతాయి. 
 
ఆ తర్వాత భారతదేశంలో కానీ, పాకిస్తాన్‌లో చేరడానికి కానీ, లేదా స్వతంత్రంగా ఉండడానికి వాటికి స్వేచ్ఛ ఉంటుంది. పోతూపోతూ భారతదేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలన్న బ్రిటిషర్ల కుట్రలో భాగమే ఇది. 1947 జూలై 25 నాడు మౌంట్‌ బాటన్‌ చాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లకు సంబంధించి ఒప్పందం చేసుకొమ్మని మిగితా విషయాల్లో వారు స్వతంత్రంగా ఉండొచ్చని సూచించాడు. 
 
ఈ స్వదేశీ సంస్థానాలలో 300కు పైగా చిన్నాచితకవి ఉన్నాయి. వాటి సగటు వైశాల్యం దాదాపు 20 చదరపు మైళ్లు ఉంటుంది. సగటు జనాభా 3వేలు, వార్షిక ఆదాయం రూ.20 వేలు పైన ఉంటుంది. ఇలాంటి సంస్థానాలు స్వతంత్రంగా ఎలా మనగలవు? 550 సంస్థానాలను ఆధునిక భారతంలో విలీనం చేయడం అనితరసాధ్యమైంది. 
 
ఈ కార్యాన్ని మన సర్దార్‌ పటేల్‌ అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. ఆయనకు వి.పి.మీనన్‌ అందించిన సహకారం మరవలేనిది. ఈ బ్రిటిష్‌ కుట్రలను చేధిస్తూ అపర చాణక్యుడు, రాజనీతి దురంధరుడు, నిష్కళంక దేశభక్తుడు, ధీశాలి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సంస్థానాధీశులందరికీ భారత యూనియన్‌లో కలవడానికి గల కారణాలను వివరిస్తూ సవివరమైన ప్రకటన పంపారు. 
 
ఈ ప్రకటనకు మెజారిటీ సంస్థానాల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. కొన్ని మాత్రం మొండికేశాయి. అందులో అతిపెద్దదైన హైదరాబాద్‌ సంస్థానం ఒకటి. హైదరాబాద్‌ సంస్థానాన్ని కామన్‌వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో స్వతంత్ర దేశంగా ప్రకటించాలని 1947 జూలై 11న మౌంట్‌ బాటన్‌ దగ్గరకు నిజాం ఒక ప్రతినిధి బృందాన్ని పంపించాడు. చర్చల 
అనంతరం నిజాం రెండు నెలల వ్యవధి కోరాడు.
 
పాక్ తో చేరతానని నిజాం బెదిరింపు 
 
ఒత్తిడి చేస్తే పాకిస్తాన్‌తో చేరుతానని భారతదేశాన్ని బెదిరించాడు.భౌగోళిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని మౌంట్‌ బాటన్‌ నిజాంకు సలహా ఇచ్చాడు. ఆగస్టు 15కు వారం రోజుల ముందే నిజాం మౌంట్‌బాటన్‌కు స్వయంగా లేఖ రాస్తూ విలీనం కాకుండా భారతదేశంతో ఒప్పందానికి సంసిద్ధత వ్యక్తం చేశాడు. దీనిని సర్దార్‌ పటేల్‌ తిరస్కరించారు.

1947 ఆగస్టు 27న నిజాం ఒక ప్రకటన చేస్తూ ‘‘నా వైఖరి ఏమిటో నేను 1947 జూన్‌ 11 నాటి నా ఫర్మానాలోనూ 1947 ఆగస్టు 14 నాటి నా ప్రసంగంలోనూ ప్రకటించాను. నా రాజ్యానికి సంబంధించినంత వరకు బ్రిటిష్‌ వాళ్లు వెళ్లడంతోనే ఇది స్వతంత్ర సార్వభౌమిక రాజ్యం అవుతుంది. దీనికి అనుగుణంగానే 1947 ఆగస్టు 15న నేను ఆ ప్రతిపత్తి పొందాను.’’ అని తెలిపారు.

అటు పాకిస్తాన్‌లోనూ ఇటు భారత్‌లోనూ విలీనం కాకుండా స్వతంత్రంగా భారత్‌తో ఒక యథాతథ స్థితి ఒప్పందంపై నిజాం ప్రయత్నించాడు. అది కుదరదని తెలియడంతో నిజాం ఈ ప్రకటన చేశాడు. తదనంతరం భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వానికి పలు దఫాలు చర్చలు జరిగాయి. నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంపై పలు ఒత్తిడులు తెస్తూ ఒప్పందం తమకు అనుగుణంగా ఉండేలా శతవిధాల ప్రయత్నించింది.

చివరి చర్చలు నవంబర్‌ 24, 25 తేదీలలో జరగగా ఎట్టకేలకు 1947 నవంబర్‌ 29న ‘యథాతథ స్థితి ఒడంబడిక’ మీద నిజాం సంతకం చేశాడు. ఇది ఐదు అంశాలతో కూడిన ఒడంబడిక. సంతకం చేసిన తదుపరి రోజు నుండే నిజాం ఆ ఒడంబడికలోని ఏ అంశాలను  గుర్తించలేదు, గౌరవించలేదు. ఒడంబడికలోని అంశాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్సులు కూడా జారీ చేశారు. ఈ కారణంగా మళ్లీ ఎన్నో చర్చలు జరిగాయి.

1948 జనవరి 30న ఒక ప్రతినిధి బృందం దిల్లీకి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ హత్య కారణంగా చర్చలు వాయిదా పడ్డాయి. ఈ మధ్య కాలంలో సంస్థానంలో హిందువులపై దారుణాలు విపరీతంగా జరుగుతూ వచ్చాయి. యథాతథ స్థితి ఒడంబడిక ఏకపక్ష ఉల్లంఘనలపై భారత ప్రభుత్వం ఉటంకిస్తూ హెచ్చరించగా నిజాం ప్రతినిధి బృందం డొంకతిరుగుడు సమాధానాలతో కాలయాపన చేస్తూ వచ్చింది. 
 
మార్చి 5న సర్దార్‌ పటేల్‌కు తీవ్ర గుండెపోటు వచ్చింది. భారత ప్రభుత్వం కోరినా నిజాం ప్రభుత్వం ఒప్పందానికి భంగకరమైన ఆర్డినెన్సులను ఉపసంహరించుకోలేదు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మార్చి 23న భారత ప్రభుత్వం నిజాంకు ఘాటైన లేఖ రాసింది. దానిని భారత ఏజెంట్‌ జనరల్‌ కె.ఎం.మున్షీ స్వయంగా మార్చి 26న హైదరాబాద్‌ సంస్థాన ప్రధానమంత్రి లాయక్‌ అలీకి అందించారు. 
 
దానితో రెచ్చిపోయిన అలీ నిజాం ఒక అమరవీరుడిగా మరణించదలిచాడని, అతనితోపాటు లక్షలాది మంది ముస్లింలు
చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు. రజాకార్ల దండుతో ఉన్న నిజాం ప్రభుత్వం తిరుగుబాటు ధోరణితో ఉంది. 
 
ఇండియా బాగా బలహీనంగా ఉందని, కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌తో యుద్ధంలో ఉన్నది కావున ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదని నిజాం, అతని సలహాదారుల భావించారు. ఈ ధైర్యంతోటే హైదరాబాద్‌ రేడియో ఒక ప్రకటన చేస్తూ యుద్ధం గనక వస్తే వేలాది మంది పఠాన్‌లు భారతదేశంపై దండయాత్ర చేస్తారని బెదిరించారు.