మూడు రాజధానులపై `సుప్రీం’ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌ సవాల్‌ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పును వెలువరించింది.
 
అలా చేయడమంటే శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.  సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని సర్కార్ పేర్కొంది.
 
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులని పిటిషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కార్‌ తెలిపింది. కాగా,మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపర్చారు.

 కాగా, తిరిగి తాజాగా మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. ఎలాగైనా సరే రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో వేచి చూడాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్‌లో కోరింది

కాగా, మూడు రాజధానుల ప్రతిపాదన ఒక రాజకీయ ఎత్తుగడ అని బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు విమర్శించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని ఆయన స్పష్టం  చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదని పేర్కొన్నారు. అమరావతి రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు.