అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని… కేంద్ర మంత్రి స్పష్టం

అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని అని  ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది, 40 శాతం పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా గుర్తింపు పొందిన అమరావతిని వేగంగా అభివృద్ధి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద చూపాలని ఆయన హితవు చెప్పారు. 
 
గొల్లపూడి వద్ద పశ్చిమ బైపాస్ రోడ్ పనులను పర్యవేక్షించిన అనంతరం మాట్లాడుతూ ఏపీ రాజధానిగా గుర్తించిన కారణంగానే దాని అభివృద్ధికి పలువిధాలుగా కేంద్రం సహకారం అందించినట్లు చెప్పారు. విధానపరమైన అంశాల కారణంగా అభివృద్ధిని నిలిపి వేయడం తగదని పరోక్షంగా మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. 
 
పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ ఏడాది జూన్ రెండో తేదీ నాటికి ఎనిమిదేళ్ళు దాటిందని గుర్తు చేశారు. 
 
 ‘అటల్ భూజల్ యోజన’ అమలు చేయరే!
కాగా, 72 గ్రామాలలో కిడ్నీ జబ్బులు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా  కేంద్ర పథకం ‘అటల్ భూజల్ యోజన’ కింద స్వచ్ఛమైన నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఏపీ ప్రభుత్వ అధికారులను కేంద్ర మంత్రి ప్రశ్నించారు. విజయవాడలో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతూ మల్టీ విలేజ్ స్కీం కింద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
ఆయుష్ భారత్ స్కీం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల బీమా సౌకర్యం ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయుష్మాన్ కార్డులు ఎందుకు ప్రింట్ కావడం లేదని ప్రశ్నించారు. కేంద్రం డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వం కార్డులు ముద్రించి ఇవ్వాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డు‌లు అర్హులందరికీ ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. 
 
పిల్లలు పోషక విలువలు లేక ఇబ్బంది పడకూడదని భూషణ్ అభియాన్‌ పథకం తీసుకువచ్చామని, ఈ పథకం చెబుతూ అమలుకు హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ శాఖలు సమన్వయం‌తో పని చేయాలని ఆయన సూచించారు.