ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై టీడీపీ ఎమ్మెల్యేలు వరుస ప్రశ్నలు సంధించారు. 
 
దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలుమార్లు అసెంబ్లీని వాయిదా వేయడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆరోపించారు. పరిపాలనా వికేంద్రీకరణపై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడం లేదని పేర్కొంటూ వారిని సస్పెండ్ చేయాలనీ కోరారు. 
 
దీంతో స్పీకర్ ఒక రోజు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
 
కట్టని రాజధాని కోసం కుత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం 
ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో మాట్లాడుతూ తాత్కాలిక రాజ‌ధానిలో ఎలాంటి అభివృద్ధి చేయ‌లేద‌ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి ప్రాంతాల గురించి ఉద్య‌మాలు చేస్తున్నార‌ని,  ఇత‌ర ప్రాంతాల వారిని రెచ్చ‌గొడుతూ డ్రామాలు ఆడుతున్నార‌ని మండిపడ్డారు. వారి ఉద్య‌మం ఎవ‌రికోస‌మ‌ని జ‌గ‌న్ నిల‌దీశారు. 
 
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల అభివృద్ధి కోస‌మా? అని  ప్రశ్నించారు. క‌ట్ట‌ని రాజ‌ధాని గురించి ..క‌ట్ట‌లేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ‌, రియ‌ల్ ఎస్టేట్ ఉద్య‌మాన్ని న‌డిపిస్తున్నార‌ని ధ్వజమెత్తారు. మిగిలిన ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెత్తందారుల సొంత అభివృద్ధికోస‌మే వారి ఉద్య‌మ‌మ‌ని జ‌గ‌న్ ఆరోపించారు.
‘‘అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో భాగంగా కర్నూలు, విశాఖలను యాడ్ చేయాలనుకున్నా. రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చంద్రాబాబే చెప్పారు” అని గుర్తు చేశారు. 
 
టీడీపీ ఐదేళ్ల పదవీకాలంలో గ్రాఫిక్స్ చూపించి జనాన్ని మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదని, పైగా,  రూ. 2290 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారని తెలిపారు. అమరావతి రాజధాని అనేది ఓ స్వప్నాల వేట మాత్రమే… ఇది వందేళ్లయినా పూర్తి కాదని స్పష్టం చేశారు.