ఏపీని దోచుకొనే వారినే ప్రజలు ఎన్నుకున్నారు 

ఆంధ్రప్రదేశ్‌ను దోచుకునే వారినే ప్రజలు ఎన్నుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండే సహజ వనరులన్నీ ఇక్కడి కుటుంబ పాలన చేస్తున్న నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 
 
మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి డబ్బు ఒక ఆయుధంగా చేసుకున్నారని చెబుతూ అయితే రూ. 8.60 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రూ 3 లక్షల కోట్లతో హైవేల నిర్మాణాలను కేంద్రం చేపట్టిందని చెప్పారు. 
సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి  లిక్కర్, ఇసుక, గనులు మాఫియాగా మరి దోచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  ప్రభుత్వ లిక్కర్ షాపులో జగన్ పేటియం ఉంటుందని, లిక్కర్ ద్వారా విచ్చల విడిగా జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు.
కనీసం బస్టాండ్ కూడా కట్టలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. నీటి ప్రాజెక్టుల గురించి రాయలసీమ నేతలు నోరెత్తడం లేదని తెలిపారు.  రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని వీర్రాజు తెలిపారు. మూడు రాజధానులు అని చెప్పే నాయకులు అభివృద్ధి మాత్రం మూలాన పెట్టేశారని సోము వీర్రాజు విమర్శించారు.