దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ కోసం కేంద్రం విశేష కృషి

దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి  ఏ.నారాయణ స్వామి తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం విస్తృత పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనూ దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 
 
దివ్యాంగులకు చేసే సేవ భగవంతుని సేవ కంటే గొప్పదన్న ఆయన, సమాజంలో ప్రతిఒక్కరూ దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించిన నారాయణస్వామి, దివ్యాంగులు, వయోవృద్ధుల అవసరాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ “అలిమ్కా” తయారు చేసిన ప్రత్యేక పరికరాలను జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 
 
కలెక్టరేట్ లోని స్పందన హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని లబ్ధిదారులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఒంగోలు, దర్శి, గిద్దలూరు, కొండపి, యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురంలలో నిర్వహించిన గుర్తింపు శిబిరాలలో నమోదు చేసుకున్న 1583 మంది దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా 2.5 కోట్ల రూపాయల ఉపకరణాలు పంపిణీ చేసే క్రమంలో తొలుత ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 
 
 బ్యాటరీ ట్రై సైకిళ్లు తప్ప మిగతా మామూలు ట్రై సైకిళ్లు, ఇతర పరికరాలను దివ్యాంగులకు, వృద్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో బ్యాటరీ ట్రై సైకిల్ విలువ సుమారు రూ.42 వేలు అని, అందించే మొత్తం బ్యాటరీ ట్రై సైకిళ్ల విలువ రూ.1.15 కోట్లు అని వివరించారు. ఇందులో లబ్ధిదారుల వాటాగా రూ.25 లక్షలను ఎం.పి. ల్యాడ్స్ నిధుల నుంచి స్థానిక ఎం.పి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెల్లించారని, మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించి అలిమ్కా సంస్థ నుంచి వీటిని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు.
 
కేవలం ఈ పరికరాలు సరఫరా చేయడమే కాకుండా మాటలు రాని పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స కూడా చేయిస్తున్నామని చెప్పారు. ఈక్యూ వైకల్యంతో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఏవిధమైన సహాయ సహకారాలు అందించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
 
 ఒంగోలులో రూ.26.64 లక్షల విలువ చేసే 72 బ్యాటరీ ట్రై సైకిళ్లు, రూ.3 లక్షలు విలువ చేసే 27 ట్రై సెకిళ్లు, రూ.2 లక్షలు విలువ చేసే వీల్చైర్లు, రూ.5.80 లక్షలు విలువ చేసే ఇతర సహాయ పరికరాలను ఉచితంగా అందజేస్తున్నట్లు ఎం.పి. శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 206 బ్యాటరీ ట్రై సైకిళ్లకు లబ్ధిదారుల వాటా క్రింద ఎం.పి. ల్యాడ్స్ నిధుల నుంచి అందజేశానని, మిగతా బ్యాటరీ ట్రై సైకిళ్లకు కూడా త్వరలోనే ఇలాగే చెల్లిస్తానని ప్రకటించారు. 
 
కలెక్టరు  ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ 2020-21 సర్వే ప్రకారం ప్రస్తుతం ఈ ఉపకరణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే నివేదిస్తామని చెప్పారు. వాస్తవ అవసరాలను గుర్తించి అలిమ్కీ నుంచి లబ్ధిదారులకు పరికరాలు అందించాలని కోరారు.