షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ

ఉజ్జెకిస్తాన్‌లోని స‌మ‌ర‌ఖండ్ న‌గ‌రంలో ప్రారంభమైన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 15 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. 
 
ఎస్సీవో స‌భ్య దేశాల నేత‌ల‌తో మోదీ ఇవాళ గ్రూపు ఫోటో దిగారు. ప్రాంతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌పై ప్ర‌ధాని మోదీ వివిధ దేశాధినేత‌ల‌తో ముచ్చ‌టించ‌నున్న‌ట్లు విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అరింద్ బాగ్చి తెలిపారు. ప్రాంతీయ శాంతి, భ‌ద్ర‌త‌, వాణిజ్యం, సంస్కృతి, టూరిజం అంశాల‌ను కూడా ఆయ‌న చ‌ర్చించ‌నున్న‌ట్లు చెప్పారు.
ఎస్సీవో నేతలు దిగిన ఫోటోల‌ను తాజాగా రిలీజ్ చేశారు. మ‌రికాసేప‌ట్లో పుతిన్‌తో మోదీ భేటీ కానున్నారు. అయితే చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యే అవ‌కాశాలు లేన‌ట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలో ప్రధానిమోదీకి ఉజ్బెకిస్థాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్ ఘన స్వాగతం పలికారు. కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, తైవాన్ విషయంలో చైనా వైఖరి వల్ల ఈ సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.