మిత్ర దేశాలు కూడా బిచ్చగాళ్లలా చూస్తున్నాయి.. పాక్ ఆవేదన 

తాను మిత్ర దేశాల్లో పర్యటించినప్పుడు డబ్బుల కోసమే వచ్చాననుకుంటున్నారని, మిత్ర దేశాధినేతలకు ఫోన్‌ చేసినప్పుడు ఇదే పరిస్థితి అని అంటూ అధ్వాన్నంగా మారిన తమ దేశ ఆర్ధిక పరిష్టితిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆక్రోశం వ్యక్తం చేశారు.

ఇస్లామాబాద్‌లో జరిగిన న్యాయవాదుల సదస్సులో మాట్లాడుతూ తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికే ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారి, కుప్పకూలే పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు. అయితే తమ సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని ఆ పరిస్థితి నుండి కొంతమేరకు కాపాడినదని చెప్పుకొచ్చారు.

“మనం 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని.. సంచారం చేస్తూ  అడుక్కుంటున్నాం. మన కంటే చిన్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో మమ్మల్ని దాటిపోయాయి. ఇప్పుడు మన పరిస్థితి చాలా దారుణంగా ఉంద” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  వచ్చే శీతాకాలంలో దేశం గ్యాస్ సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని చెబుతూ, దిగుమతుల ద్వారా ఈ పరిస్థితులను నివారించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

దీనికి తోడు జూన్‌లో వచ్చిన వరదలు మూడో వంతు పాకిస్థాన్‌ను ముంచెత్తాయని, దానితో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా తమ పరిస్థితి తయారైందని చెప్పారు. 1400 మంది చనిపోగా, దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. రూ. 95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 78 వేల చదరపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయని వివరించారు. 

ఓ వైపు కనీసం రూ. 32 వేల కోట్ల మేర అప్పుదొరుకుతుందేమోనని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద ప్రయత్నాలు చేస్తుంటే అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైపోయిందని నిస్సహాయతను షరీఫ్ వ్యక్తం చేశారు. నిజంగానే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని తెలిపారు.

గత పాలకులు ఐఎంఎఫ్‌ నిబంధనలను ఉల్లంఘించిన పాపానికి.. ఇప్పుడు ఆ సంస్థ చేపట్టే కొన్ని కార్యక్రమాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అతికష్టమ్మీద చేసిన ప్రయత్నాలతో ఐఎంఎఫ్‌ రూ. 14 వేల కోట్లను విడుదల చేసిందని, చైనా వంటి మిత్ర దేశాలు మరో రూ. 32 వేల కోట్ల మేర అప్పు ఇచ్చాయని పేర్కొన్నారు.

75 ఏళ్ళ తర్వాత మన దేశం ఎక్కడున్నదని చూస్తుంటే నిరాశే మిగులుతుందని చెబుతూ, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ అందుకు ధృడ సంకల్పం అవసరమని స్పష్టం చేశారు.