ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం… హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంఫై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. 
 
ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృంధాలు ఏర్పడి ఈరోజు కూడా బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. గతంలో హైదరాబాద్‌లో రెండుసార్లు తనిఖీ చేసిన అధికారులు.. ఈరోజు మూడోసారి సోదాలు నిర్వహించారు. 
 
హైదరాబాద్  నగరంలోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇల్లు, నానక్‌రామ్‌గూడలోని ఆఫీస్‌లలో సోదాలు చేసిన ఈడీ.. ఇప్పుడు రాయదుర్గంలో తనిఖీలు చేపట్టింది.
బీజేపీ నేతలు ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మీడియాకు రిలీజ్ చేసిన మరుసటి రోజే ఈడీ సోదాలు చేపడుతోంది. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో అభిషేక్ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
 
 గతంలో దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ,  ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం గమనార్హం.   ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.