మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అరెస్ట్ లో ఆఫ్ఘన్లపై పాక్  నెపం 

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌ ను అరెస్ట్ చేయకుండా ఆఫ్ఘానిస్తాన్ పై నెపం వేస్తూ పాకిస్థాన్ తప్పించుకోవాలని చూస్తున్నది.  మసూద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లకు లేఖ రాసింది. 
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగ్‌రహార్-కునార్ ప్రావిన్స్‌లో మసూద్ ఉన్నాడని పాకిస్థాన్ సమాచారం కూడా ఇచ్చింది. అయితే తమకు పాక్ నుంచి లేఖ ఏదీ అందలేదని తాలిబన్లు చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందడాన్ని ఆపకపోతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్‌ను ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్‌కు మార్చే అవకాశముందని తెలిసినప్పటినుంచీ పాక్ ఈ సరికొత్త నాటకం ఆడుతున్నట్లు తెలుస్తున్నది.
పారిస్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్థాన్‌పై చాలా కాలంగా కన్నేసి ఉంది. అయితే పాక్‌పై కఠిన చర్యలు తీసుకోకుండా చైనా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది.  మసూద్ ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగ్‌రహార్-కునార్ ప్రావిన్స్‌లో ఉన్నాడని పాక్ చెబుతున్నా పాకిస్థాన్ సోషల్ మీడియాలో అతడి పేరిట కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల మాదిరిగానే సాయుధ పోరు ద్వారా ప్రపంచాన్ని లొంగదీసుకోవాలని మసూద్ తన కథనాల్లో పిలుపునిస్తున్నాడు.
పాక్ లోనే మసూద్… ఆఫ్ఘన్ స్పష్టం 

కాగా, మసూద్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడని అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అజర్‌ అఫ్గాన్‌లో ఉన్నాడన్న పాక్‌ ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మౌలానా అఫ్గాన్‌లోని నంగర్హర్‌, కన్హర్‌ ప్రాంతాల్లో తలదాచుకున్నాడని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం తాలిబన్ల నేత్వంలోని అఫ్గాన్‌ సర్కార్‌కు లేఖ వ్రాయడం పట్ల తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతడు పాక్‌లోనే ఉన్నాడని, ఇలాంటి ఆరోపణలు మరోసారి చేస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని తాలిబన్‌ ప్రతినిధి అబ్దుల్‌ బల్ఖీ హెచ్చరించారు. మౌలానా తమ దేశంలోనే ఉన్నాడనడానికి సరైనా ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. మసూద్ అజహార్ ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద, మత సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని పాక్‌లో ఇటీవల 5 రోజుల పాటు పర్యటించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది.

దీంతో ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు పాక్ ఈ కొత్త నాటకానికి తెరతీసింది. మసూద్ అసలు తమ దేశంలోనే లేడని, ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నాడని నమ్మబలుకుతోంది. కానీ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్లు మాత్రం పాకిస్థాన్ లేఖ తమకు అందలేదని, మసూద్ తమ వద్ద లేడని చెబుతున్నారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ను బురిడీ కొట్టించడానికి పాకిస్థాన్ లష్కర్ ఎ తొయిబా కమాండర్ సాజిద్ మిర్‌కు శిక్ష పడేలా చేసింది. ముంబైపై నవంబర్ 26న జరిగిన దాడుల్లో సాజిద్ మిర్‌ను పాక్ దోషిగా తేల్చింది. అయితే పాక్ చర్యలు నమ్మశక్యమైనవి కావని భారత్ వాదిస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ కఠినచర్యలకు దిగకుండా ఉండేందుకు పాక్ నటిస్తోందని భారత్ ఆరోపించింది.
పాకిస్థాన్ పంజాబ్ బహవల్‌పూర్‌లో పుట్టిన మసూద్ అజహర్ 8వ తరగతిలోనే చదువు ఆపేశాడు. 1994లో ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ అన్సార్‌తో సంబంధాలు పెట్టుకుని మౌలానాగా మారి ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో పనిచేశాడు. 1994లో పేక్ ఐడెంటిటీ కార్డుతో ప్రయాణిస్తూ శ్రీనగర్‌లో అరెస్ట్ అయ్యాడు.
1999లో నేపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఖాట్మాండులో హైజాక్ చేసిన ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. అనంతరం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి మసూద్‌ను, మరో ఇద్దరు ఉగ్రవాదులను  విడిపించుకున్నారు.
నేరుగా పాకిస్థాన్ వెళ్లిన మసూద్ అజహర్ కరాచీలో పదివేల మందితో బహిరంగ సభ పెట్టాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సంపాదించేదాకా ముస్లింలు నిద్రపోరాదంటూ పిలుపునిచ్చాడు. 2000 జైష్ ఎ మహ్మద్ ఏర్పాటు చేశాడు. 2001లో భారత పార్లమెంట్‌పై  దాడికి మసూద్ మాస్టర్ మైండ్‌గా వ్యవహరించాడు.
2002లో పాక్‌లో జరిగిన పాత్రికేయుడు డేనియల్ పెర్ల్ హత్యతో మసూద్‌కు సంబంధం ఉంది. మసూద్‌ను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. 2019 పుల్వామాలో భారత జవాన్లపై దాడి చేసిన కేసుకు మసూద్ సూత్రధారి. నాటి ఘటనలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. భారత్‌లో జరిగిన అనేక దాడులకు మసూద్ సూత్రధారిగా ఉన్నాడు.