
దేశం మొత్తం మీద సెక్రటేరియట్ కి రాని ఏకైక సీఎం కేసీఆర్ అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎద్దేవా చేశారు. ఫామ్ హౌజ్ నుంచే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆమె విమర్శించారు.
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాల్గవ దశలో మంగళవారం రాత్రి మూసాపేట వద్ద పాల్గొంటూ డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందని ఆమె ఆరోపించారు.
రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి నడిచిన విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులకు కేసీఆర్ పాలనలో తీవ్ర నిరాశే మిగిలిందని ఆమె ధ్వజమెత్తారు. ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుంది? అని ప్రశ్నించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని, అయితే సీఎం కేసీఆర్ ఆ నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆమె విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అయినా ఎలాంటి అభివృద్ధి లేదని.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి తెలిపారు.అర్హులకు పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని, భగవంతుడు కరుణించినా పూజారి ప్రసాదం పెట్టనట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.
కర్ణాటకలో పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టించామని, కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ కేంద్రం నుంచి వచ్చే ఇండ్లను కూడా కట్టడం లేదని శోభా కరంద్లాజే ఆరోపించారు. అర్హులకు పెన్షన్లు, ఇండ్లు ఇవ్వడం లేదని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ పథకాల కింద కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులను కేటాయిస్తున్నారని.. కనీసం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు కేసీఆర్ తన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆమె దయ్యబట్టారు. బండి సంజయ్ సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.
ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వండి
ఉమ్మడి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు, రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కు గతంలో అవకాశాలు ఇచ్చారని, ఈసారి మాత్రం బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. పేదోళ్ల బతుకులు బాగు పడాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం, పురుగుల అన్నం పెడుతున్నారని, కలుషిత ఆహారం తిని చాలామంది విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలు ఏమయ్యాయని సంజయ్ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ.. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏడాది పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ లో ఉండేందుకేనా కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిందని ప్రశ్నించారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్