జమ్మూ కశ్మీర్లో 33 ఏళ్ల తర్వాత నేవీ శిక్షణ కేంద్రం పునరుద్ధరణ

జమ్ము కశ్మీర్లోని శిక్షణ 33ఏళ్ల తర్వాత నేవీ పునరుద్ధరించింది. గండేర్బాల్ జిల్లా మనస్బాల్ లేక్ ప్రాంతంలో ఎన్‌సిసి శిక్షణ కేంద్రాన్ని నేవీ తిరిగి ప్రారంభించింది. కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల సమస్య నేపథ్యంలో ఈ శిక్షణ కేంద్రాన్ని నేవీ మూసివేసింది. 

సెంట్రల్ కశ్మీర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం నేషనల్ క్యాడెట్ కార్ప్ (ఎన్‌సిసి) శిక్షణకు సౌకర్యవంతంగా ఉండేది. అయితే ఆ ప్రాంతంలో ఉగ్రవాదం పెచ్చుమీరడంతో శాంతిభద్రతలు క్షీణించాయి. ఈనేపథ్యంలో శిక్షణకేంద్రాన్ని 1989లో మూసివేసి జమ్ములోని మన్‌సార్ సరసు ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కాశ్మీర్లో శాంతిభద్రతలు మెరుగవడంతో మూడు దశాబ్దాల అనంతరం నేవీ శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. నేవీ శిక్షణకు అనువుగా ఉండే ఈ ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలను మనస్బాల్ డెవలప్‌మెంట్ అథార్టీ సమకూర్చిందని, మన్‌సార్ నుంచి రెండుబోట్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చామని అధికారులు వివరించారు. 

ఎన్‌సిసి గ్రూప్ శ్రీనగర్ బ్రిగేడియర్ కెఎస్ కాల్సి విలేఖరులతో మాట్లాడుతూ కశ్మ్లీర్ లోయలో ఎన్‌సిసికి ఇదో ముఖ్యమైన సందర్భమని, ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన రోజుగా అభివర్ణించారు. 

ఈ శిక్షణ శిబిరంలో జమ్ము కాశ్మీర్లోని పలు కాలేజీల నుంచి వందమంది ఎన్‌సిసి క్యాడెట్లు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారని వీరిలో విద్యార్థినులు కూడా ఉన్నారని తెలిపారు. వీరికి సాయుధ బలగాల్లో చేరేందుకు అవసరమైన శిక్షణ ఇస్తామని బ్రిగేడియర్ కాల్సి తెలిపారు.