ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాబోతున్నారు. ఎలిజబెత్–2 పార్థివదేహం స్కాట్ లాండ్ లోని ఎడిన్ బరో నుంచి మంగళవారం రాత్రి సైనిక రవాణా విమానంలో లండన్ కు చేరింది. క్వీన్ శవపేటికను కింగ్ ఛార్లెస్, ఆయన భార్య కెమిల్లా అందుకున్నారు.

క్వీన్ డెడ్ బాడీని బకింగ్ హం ప్యాలెస్ లోని బౌ రూంలో ఉంచారు. రాజవంశీయులందరూ నివాళులు అర్పిస్తున్నారు. క్వీన్ గార్డెన్స్, దమాల్, హార్స్ గార్డ్స్, వైట్ హాల్, పార్లమెంటు స్ట్రీట్, పార్లమెంట్ స్క్వేర్, న్యూ ప్యాలెస్ యార్డ్ మీదుగా శవపేటికను ఊరిగేంపుగా పార్లమెంటు బిల్డింగ్ వెస్ట్ మినిస్టర్ కు తరలిస్తారు.

ఇక ఈ నెల 19 న లండన్ వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఈమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.  దీని కోసం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. మొత్తం 500 మంది విదేశీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరు కాగలరని భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా, దాని మిత్రదేశ బెలారస్, సైనిక పాలన ఉన్న మయన్మార్ దేశాలకు క్వీన్ అంత్యక్రియలకు ఆహ్వానం పంపలేదని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.

ఈ అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయి భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలుపుతారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఆమె లండన్ లో ఉంటారు. భారతదేశం తరపున ఎలిజబెత్ రాణికి ఆమె నివాళి అర్పించున్నారు. 

ఈ నెల 8న క్వీన్ ఎలిజబెత్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాణి మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని మోదీలు సంతాపాన్ని ప్రకటించారు. రాణి మరణం నేపథ్యంలో ఈ నెల 11న భారత్ లో సంతాప దినాన్ని పాటించారు.

కాగా, గత నెలలోనే రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముర్ముకు ఇదే తొలి అధికారిక విదేశీ పర్యటన కానున్నది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ నెల 12న బ్రిటిష్ హై కమిషన్‌ను సందర్శించి, భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలిపారు.