షాంఘై శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ 

ఉజ్బెకిస్థాన్ లోని సమర్‌కండ్ లో ఈనెల 15,16 తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరో 14 మంది ప్రపంచ దేశాల నేతలు హాజరు కానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, తదితరులు ఈ 15 మంది నేతల్లో ఉన్నారు. 
కరోనా మహమ్మారి తరువాత ఇదే మొదటి సమావేశం. ఎస్‌సిఒ చివరి సమావేశం 2019 జూన్ నెలలో కిర్గిజ్‌స్థాన్ లోని బిష్‌కెక్‌లో జరిగింది. భారత్ ప్రధాని మోదీ14న ఉజ్బెకిస్థాన్ వెళ్లి తిరిగి 16న భారత్‌కు వస్తారు. వచ్చే ఏడాది షాంఘై కోఆపరేషన్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనున్నందున ఇప్పుడు ఈ సమావేశం భారత దేశానికి కీలకం కానున్నది.
వచ్చే ఏడాది ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ కూడా ఆహ్వానితుల్లో ఉన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచం లోని ప్రధాన దేశాలైన రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు ఒకే వేదికపై కలుసుకుంటున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత్ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా దేశాల మధ్య వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన, పర్యావరణ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.