బ్రిటన్ మహారాజుగా ఛార్లెస్-3 అధికారిక ప్రకటన

బ్రిటన్ మహారాజుగా ఛార్లెస్-3ని శనివారం అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన జారీ చేశారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణించడంతో వంశపారంపర్యంగా ఛార్లెస్-3 గురువారం మహారాజు అయ్యారు. దీనిని యాక్సెషన్ కౌన్సిల్ అధికారికంగా ధ్రువీకరించింది. ఆయనను సావరిన్‌గా ప్రకటించింది.
లండన్‌లోని రాయల్ రెసిడెన్స్ సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యాక్సెషన్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. దీనిలో సీనియర్ రాజకీయవేత్తలు, అధికారులు ఉన్నారు. ఛార్లెస్ -3 సతీమణి కెమిల్లా, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విలియం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయ్యారు. ఈ రాజ వంశానికి తదుపరి వారసుడు ఆయనే.   తనను బ్రిటన్ మహారాజుగా ధ్రువీకరిస్తూ ప్రకటన జారీ అయిన తర్వాత ఛార్లెస్-3 ప్రీవీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సార్వభౌమాధికార కర్తవ్యాలు, బాధ్యతలను స్వీకరిస్తున్నానని వ్యక్తిగత ప్రకటనను జారీ చేశారు. తన తల్లి అడుగు జాడల్లో నడుస్తానని తెలిపారు.
క్వీన్ అంత్యక్రియలు జరిగే రోజు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించారు. అయితే అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో అధికారికంగా ప్రకటించలేదు. బహుశా ఈ నెల 19న ఈ కార్యక్రమం జరుగుతుందని బ్రిటిష్ మీడియా చెప్తోంది.
యాక్సెషన్ కౌన్సిల్ సమావేశం రెండు భాగాలుగా జరిగింది. మొదటి భాగంలో ఛార్లెస్-3 పాల్గొనలేదు. ఆయన పరోక్షంలో ఆయనను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ సహా వందలాది మంది ప్రీవీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.  మహారాజును ప్రకటించిన తర్వాత లండన్ టవర్ వద్దనున్న హైడ్ పార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సైనిక స్థావరాల్లో తుపాకులను పేల్చి కింగ్ ఛార్లెస్-3కి గౌరవ వందనం చేశారు.
 
భావోద్వేగ ప్రసంగం 
రాణి ఎలిజెబెత్ 2 మ‌ర‌ణానంత‌రం బ్రిట‌న్ రాజు చార్లెస్‌-3 శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ చాలా భార‌మైన హృద‌యంతో మాట్లాడుతున్నాన‌ని, జీవితాంతం, మా అమ్మ.. మ‌హారాణి.. త‌న‌కు ప్రేర‌ణ‌గా నిలిచింద‌ని, త‌న‌కు, త‌న కుటుంబానికి ఆమె ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింద‌ని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 

ఆమె ప్రేమ‌, అనురాగం, మార్గ‌ద‌ర్శ‌నం, అన్నింటికి ఆమెకు రుణ‌ప‌డి ఉన్న‌ట్లు కింగ్ చార్లెస్ తెలిపారు. 21 ఏళ్ల వ‌య‌సులో.. 1947లోనే కేప్‌టౌన్ నుంచి కామ‌న్‌వెల్త్ దేశాల‌ను ఉద్దేశించి త‌న త‌ల్లి మాట్లాడార‌ని, స్వ‌ల్ప కాల‌మైనా, సుద‌ర్ఘీ కాల‌మైనా.. ప్ర‌జ‌ల జీవితం కోసం అంకిత భావంతో ప‌నిచేయ‌నున్న‌ట్లు చెప్పింద‌ని ఛార్లెస్ గుర్తు చేశారు.

వాగ్దానం క‌న్నా ఎక్కువే త‌న త‌ల్లి సేవ చేసింద‌ని, త‌న జీవితానికి ఎంతో క‌ట్టుబ‌డి ఉంద‌ని, త‌న విధుల కోసం ఎన్నో త్యాగాల‌ను చేసిన‌ట్లు ఛార్లెస్ తెలిపారు. ఆమె అంకిత‌భావం, భ‌క్తి.. సౌర్వ‌భౌమ‌త్వానికి ఎన్న‌డూ ఆటంకం కాలేద‌ని పేర్కొన్నారు. సాంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూనే ఆమె ప్ర‌జా జీవితాన్ని కొన‌సాగించిన‌ట్లు చెప్పారు. 

మై డార్లింగ్ మామ అంటూనే త‌ల్లి దివంగ‌త మ‌హారాణి ఎలిజ‌బెత్‌కు థ్యాంక్స్ తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో రాణిగారి పట్ల దేశ ప్రజలు చూపించిన ప్రేమకు, తమకు అండగా ఉంటున్న బ్రిటన్ ప్రజలకు, కామన్వెల్త్ దేశాధినేతలకు,  ప్రపంచవ్యాప్తంగా సంతాపం తెలిపిన వారందరికి చార్లెస్ 3 కృతజ్ఞతలు తెలిపారు.

తాను తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 జీవితాంతం చేసిన సేవను కొనసాగిస్తానని తెలిపారు. తన ప్రియమైన  తండ్రిని కలుసుకోవడానికి మహాప్రస్థానాన్ని ప్రారంభించిన తన తల్లి తన కుటుంబానికి జీవితాంతం సేవలందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.