వినాయక నిమజ్జనం విషయంలో దిగొచ్చిన తెలంగాణ సర్కార్

హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబడింది. ఈ తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది. 
 
ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను సిద్ధంగా ఉంచారు.  ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఉత్తర కాశీకి చెందిన ఆదిశంకర బ్రహ్మ విద్యాపీఠం ప్రజ్ఞానంద సరస్వతి స్వామిజీ వారికి నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.  ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు.  ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇచ్చారు. 
ఇక హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని  శ్రీనివాస్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు.పరిశీలించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు.
 
బాలాపూర్ వినాయకుడి నుంచి ఖైరతాబాద్ వినాయకుడి వరకు..  నగరంలో అన్ని విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. నిమజ్జనం ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తలసాని తెలిపారు.  ఓవైపు గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదని తలసాని వాపోయారు. 
 
నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తలసాని స్పష్టం చేశారు.  వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహకులు ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావద్దని నిమజ్జనానికి అవసరమైన ప్రతిదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. 
 
నిమజ్జనం 9వ తేదీ ఉన్నందునా ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌తో పాటు పర్యాటకులకు ఇబ్బందులు కల్గకుడదనే క్రమ క్రమంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గురువారం రాత్రి వరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు 38 వేల విగ్రహాలను ప్రతిష్టించారని వీటన్నింటిని ప్రశాంతగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. 
కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పుడు వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పై క్రేన్లు ఏర్పాటు చేయిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అయినా ఇప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని విమర్శించారు.