జాతీయ కూటమిపై కేసీఆర్ కు నితీష్ బిగ్ షాక్

దేశంలో బిజెపి, కాంగ్రెస్ లేని మూడో కూటమి ఏర్పాటు చేసి, సారధ్యం వహిస్తానంటూ చెబుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పెద్ద షాక్ ఇచ్చారు. వారం రోజుల క్రితమే పాట్నా వెళ్లి, నితీష్ తో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రస్తావన రాగానే అసహనంగా, సమావేశం ముగించిన నితీష్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. 
 
అంతేకాకుండా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశీ పర్యటన నుండి తిరిగి రాగానే వెళ్లి కలుస్తానని కూడా చెప్పారు. పైగా, తాము అన్ని ప్రతిపక్షాలను కలిపి బిజెపికి వ్యతిరేకంగా ఒకే ప్రధాన కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని, అది మూడో కూటమి కాదని స్పష్టంగా ప్రకటించారు. అంటే కేసీఆర్ చెబుతున్న కూటమి అసలు కార్యరూపం దాల్చే అవకాశం లేదన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 
 
‘సోనియా గాంధీ విదేశాల నుంచి రాగానే ఆమెను కలుస్తాను. అవసరమైతే మేం (ప్రతిపక్ష నేతలు) మళ్లీ కలుస్తాం. అందరి వైఖరి సానుకూలంగా ఉంది. మేం మెయిన్ ఫ్రంట్ కావాలనుకుంటున్నాం, మూడో ఫ్రంట్ కాదు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిని కొనసాగిస్తా.’’ అని ప్రకటించిన నితీష్ కేసీఆర్ కు అనూహ్యమైన షాక్ ఇచ్చినట్లయింది.
కేసీఆర్ గత కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల బీహార్‌లో పర్యటించిన కేసీఆర్ అక్కడ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కేంద్రంలో రొటీన్ ప్రభుత్వాలు వద్దని దేశాన్ని మార్చే ప్రభుత్వం రావాలని కేసీఆర్ చెప్పారు. రోటీన్ ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ (యూపీఏ), బీజేపీ (ఎన్డీయే) అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలోనే  ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

2024లో విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిశ్ కుమార్ పేరుపై అభిప్రాయాన్ని చెప్పాలని కేసీఆర్‌ను మీడియా ప్రతినిధులు అడిగ్గా  దీనిపై స్పందించిన కేసీఆర్.. ‘ఇది చెప్పడానికి నేను ఎవరు? నేను సమాధానం ఇస్తే ఇతర పక్షాలు అభ్యంతరం చెప్పొచ్చు. మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు?” అని బదులు ఇచ్చారు.

తాజాగా ఇప్పుడు నితీశ్ చేసిన కామెంట్స్కే సీఆర్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని, వచ్చే ఎన్నికలలో రెండూ కలసి పోటీ చేస్తాయని, బిజెపి మాత్రమే తెలంగాణాలో అసలైన ప్రతిపక్షమని ఆ పార్టీ  తెలంగాణ నాయకులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.

 తాజాగా నితీష్ కుమార్ చేసిన వాఖ్యలో తెలంగాణ బిజేపికి ఓ బలమైన రాజకీయ ఆయుధం సమకూర్చిన్నట్లయింది. ఇప్పటికే బీహార్ లో కాంగ్రెస్ తో కూడిన కూటమికి నేతృత్వం వహిస్తున్న నితీష్ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళలేరు. కాంగ్రెస్ తో జత కడితే తెలంగాణాలో కేసీఆర్ కు రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యం కాగలదు.

బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలు వేటికి తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పక్షం కాదు. మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాంతీయ పక్షాల నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఉంది. దానితో ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవీ కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటుకు సిద్ధంగా లేవు. అక్కడ  ఒకవంక మమతా బెనర్జీకి, మరోవంక కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించేందుకు భూమిక ఏర్పడడం లేదు.