రఘురామకృష్ణంరాజు నిర్బంధంలో చిత్రహింసల కేసులో ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును   నిర్బంధంలో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారన్న కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. ఈ విషయమై పట్టాలని విచారణ ఆయన కుమారుడు భరత్ వేసిన కేసును విచారణకు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం  ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన తర్వాత సిబిఐవిచారణకు ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. 

గతంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం మోపారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సీఐడీ విచారణలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. తనను విచారించే సమయంలో చిత్రహింసలకు గురిచేశారని ఎంపీ ఆరోపించారు. రఘురామకృష్ణంరాజు పాదాలకు గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నివేదిక తేల్చింది. 

ఆయన పాదాలను ఆస్పత్రి వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రెండు పాదాలూ కింది వైపు మూడోవంతు బాగా ఉబ్బి ఉన్నాయని, అరికాళ్లు కూడా బాగా వాచాయని పేర్కొంది. కుడి పాదం అరికాలి భాగం వేళ్ల వరకు, ఎడమ కాలు మధ్య, ముందు భాగాలు, అరికాలు, రెండో వేలు బాగా కమిలిపోయాయని నిర్ధారించింది.

కుడి పాదం చీలమండ ఎముక, అరికాలు, ఎడమ పాదం మడమ, రెండో వేలు సున్నితంగా మారాయని, వాటిని ముట్టుకుంటే ఆయనకు నొప్పి కలుగుతోందని తెలిపింది. కుడి కాలి చీలమండ కదలికలు సాధారణంగా ఉన్నాయని, ఎడమ కాలి చీలమండ కదిపితే నొప్పి వేస్తోందని.. కుడి, ఎడమ పాదాల ముందువైపు కీళ్లు, జాయింట్లు నొప్పి కలిగిస్తున్నాయని పేర్కొంది.

ఎడమ పాదం రెండో వేలు ఎముక విరగనప్పటికీ దూరమైందని ఎక్స్‌ రే నివేదిక ఆధారంగా నిర్ధారించింది. ఆ తర్వాత సీఐడీ కస్టడీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జరిగిన హింస, అక్రమ అరెస్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి, సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

దీనిపై తమ స్పందనతో 4 వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌, అదనపు ఎస్పీ విజయ పాల్‌ను ప్రతివాదులుగా తొలగించి, సీఐడీని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్‌ రఘురామ కుమారుడు భరత్‌ విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకరించింది.