బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్స్ వేటు?

బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్‌ పై సస్పెన్స్ వేటుకు రంగం సిద్ధమైంది. వర్షాకాల సమావేశాల నుంచి ఈటలను సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 

సభాపతి మరమనిషిలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని, బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను  ఆహ్వానించకపోవడం దారుణమని ఈటెల చేసిన విమర్శలపై వివరణ ఇవ్వాలని ఈటలకు స్పీకర్ కార్యాయం నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నోటీసులకు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే, ఈనెల 12, 13 తేదీల్లోజరిగే వర్షాకాల సమావేశాల్లో ఈటల రాజేందర్ పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. సస్పెన్స్ కోసమే నోటీసులు జారీ చేశారని విమర్శించారు.

సభలో తన ముఖం చూడకూడదని సీఎం కేసీఆర్ అనుకొంటున్నారని రాజేందర్ ఆరోపించారు. ధైర్యముంటే ఆ విషయం సభాముఖంగా చెప్పాలని సవాల్ చేశారు. ‘‘నాకు ఏం నోటీసులు పంపుతారో చూస్తాం… ఇప్పటి వరకు నాకు ఎలాంటి నోటీసులు అందలేదు’’ అని చెప్పారు.

 స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 స్పీకర్ తీరుపై శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు నిలదీస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందని, అందుకే సభను రెండ్రోజులపాటే నిర్వహించి తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నారని సంజయ్ విమర్శించారు. 

అసలు స్పీకర్ ను అవమానించింది ప్రశాంత్ రెడ్డినే అని బిజెపి ఎమ్యెల్యే  రఘునందన్ రావు ఆరోపించారు. నిజామాబాద్ లో ప్రశాంత్ రెడ్డి నీకు స్పీకర్ కు మధ్య జరిగింది ఏందో ఒక సారి చెప్పు అని చురకలు అంటించారు. ఏదో కారణం తో సభ నుండి బయటకు పంపించాలి అని చూస్తున్నారని, సమస్యల మాట్లాడకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎం చెప్పింది చేయడం తప్పా.. స్పీకర్‌‌ పోచారానికి  వేరే పని లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని,  కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నయంటే తమ సమస్యలు ప్రస్తావించమని పలు రంగాల వారు విన్నవించుకునే పద్ధతి ఉండేదని ఈటల పేర్కొన్నారు. పైగా, ఉమ్మడి ఏపీలో 80, 90 రోజులు సమావేశాలు జరిగేవని, బడ్జెట్ సమావేశాలు 40 నుంచి 45 రోజులు కొనసాగేవని పేర్కొన్నారు. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి అకారణంగా, అన్యాయంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. 

ఇక్కడ సీఏం తప్పించుకోవచ్చు గానీ, ప్రజల చేతిలో ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడుతామని, లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈటల పేర్కొన్నారు.