రుషికొండపై నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే కూల్చివేత

విశాఖపట్నంలో రుషికొండపై జరిగే నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే కూల్చివేతకు ఆదేశిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌కు విరుద్ధంగా విశాఖ జిల్లా చినగదిలి మండలం ఎండాడ గ్రామం పరిధిలోని సర్వే నంబర్‌ 19లో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నరసాపురం ఎంపీ రామకృష్ణంరాజు,  విశాఖవాసి, జనసేన కార్పొరేటర్ పీవీఎన్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యలు దాఖలు చేశారు. 

సోమవారం వీటిపై మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విచారణకు హాజరు కాలేదని, విచారణను రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. 

మూర్తి యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె ఎస్  మూర్తి వాదనలు వినిపిస్తూ కోర్టులో వివాదం కొనసాగుతుండగానే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యాలపై విచారణ జరపాలని కోరారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గతంలో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసినా, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపినా కూల్చివేతకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. 

రిషికొండపై పాత భవనాల కూల్చివేతకు ఉత్తరువులు జారీచేసిన తర్వాత, కేంద్ర పర్యావణ మంత్రిత్వ శాఖ అనుమతితో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ 9.88 ఎకరాలలో నూతన భవనాల నిర్మాణం చేపట్టింది.  అయితే అనుమతించిన 9.88 ఎకరాల పరిధిని అధిగమించి నిర్మాణాల కోసం కొండలను తవ్వుతున్నరుని మూర్తి యాదవ్ ఆరోపించారు. నిర్మాణ పనులకోసం చెట్లను నరికి వేయడంతో పాటు రెండు గొట్టపు బావులను కూడా తవ్వారని తెలిపారు.