గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే ప్రగతి భవన్ వేదికగా నిమజ్జనం

వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు స్రుష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు స్రుష్టించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. 
 
వెంటనే ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో ప్రగతి భవన్ వేదికగా గణేష్ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  ప్రతి ఏటా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్ఎస్ పాలనలో ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వినాయక ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు దాటినా ఇప్పటి వరకు నిమజ్జనం కోసం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు.  కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలోనూ పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ర్యాలీలు చేశారని, కరోనా సమయంలో బాదం, పిస్తాలు పంచినా మేమేనాడు అడ్డుకోలేదని గుర్తు చేశారు.
 
భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతూ ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  గణేష్ ఉత్సవాల సమయంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దని చెబుతున్న ప్రభుత్వానికి దమ్ముంటే… ఎవరు లౌడ్ స్పీకర్లు ఎక్కువగా ఉపయోగటిస్తున్నారనే అంశంపై చర్చించేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.
 
కాగా, ఉపాధ్యాయ దినోత్సవం రోజున కేసీఆర్ ప్రభుత్వం 13 జిల్లాల ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  317 జీవో విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను టీచర్స్ డే రోజైనా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందేమోనని భావించి వందలాది మంది టీచర్లను అరెస్ట్ చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.