
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆరు వారాలుగా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకొనక పోవడంతో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. 42 రోజుల సమ్మె కాలంలో దాదాపు 20 మంది వీఆర్‌ఏలు వివిధ కారణాలతో మరణించారు. వీరిలో పలువురు ఉద్యోగం క్రమబద్ధీకరణ కాదన్న మనస్తాపంతో గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచారని, మిగిలిన వారు దురదృష్టవశాత్తూ అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో మరణించారని వీఆర్‌ఏలు చెబుతున్నారు.
డిమాండ్లు సాధనకోసం సమ్మెకు దిగిన వీఆర్‌ఏలకు తోటి ఉద్యోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా తాము వెనకడుగు వేసేది లేదని, డిమాండ్లు నెరవేర్చుకునేదాకా సమ్మె విరమించబోమని వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,245 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు.
వీరిలో 19,345 మంది నిజాం కాలంలో పనిచేసిన వారు నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగాలు నిర్వహిస్తుండగా, మిగిలిన 2,900 మంది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌గా నియుక్తులయ్యా రు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి, పేస్కేలు, ఆరోగ్య బీమా, పింఛన్, పదోన్నతులు తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఈ ఏడాది జూలై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పేస్కేలు అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే తమలో పీహెచ్‌డీలు, పీజీలు, ఎంటెక్, బీటెక్ వంటి ఉన్నత చదువులు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
2016లో వీరికి పదోన్నతి కల్పించాల్సి ఉన్నా కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా అది వాయిదా పడింది. అనంతరం 10 జిల్లాలు 33 అయ్యాయి. 42 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కు చేరింది. మండలాలు 466 నుంచి 594 అయ్యాయి. ఈ పెంపునకు సరిపడా కొత్తగా వీఆర్‌ఏలను నియమించలేదు.
పైగా ఇటీవల ధరణిని ప్రవేశపెట్టే సమయంలో దాదాపు 5,500 మంది వీఆర్వోలను తొలగించారు. దాంతో వారి పని కూడా వీరే చేయాల్సి వస్తోంది. దీంతో తమకు కనీస హక్కులు అమలు కావడం లేదన్న ఆందోళనలో ఉన్న వారంతా సమ్మెకు దిగారు. 2015 నుంచి చూసుకుంటే మృతి చెందిన వారి సంఖ్య 100 మంది వరకు ఉంటుందని చెబుతున్నారు.
More Stories
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
రెండు నెలలుగా స్టాలిన్ వితండవాదం
డీకే అరుణ నివాసంలోకి చొరబడ్డ దుండగుడు