రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి!

తాలిబన్‌ పాలిత ఆప్ఘనిస్తాన్‌లో​ కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.సోమవారం కాబూల్‌లో భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి పైగా మృతి చెందినట్లు ఆ దేశ మీడియాలో ఓ ప్రకటనలో పేర్కొంది. రాయబార కార్యాలయం ప్రధాన గేటు బయట, వీసా కోసం ఆఫ్ఘన్ పౌరులు వేచి ఉన్న ప్రదేశంలో ఈ పేలుడు జరిగిన్నట్లు తెలుస్తున్నది.

కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం సమీపంలో సోమవారం బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి కారణంగా బ్లాస్ట్‌ జరిగింది. సదరు వ్యక్తి రష్యా రాయబార కార్యాలయంలోని ప్రవేశించి లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తిని తాలిబాన్ గార్డులు గుర్తించి కాల్చి చంపినట్లు పోలీసు అధికారి మవ్లావి సాబిర్ తెలిపారు.

కాగా, ఈ పేలుడు ఘటనలో దాదాపు 25 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు రష్యా దౌత్యవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, కాబూల్‌లోని ఓ మసీదులో ఈ నెల రెండున జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనలో 20 మంది మరణించారు. మృతుల్లో ప్రముఖ మత నాయకుడు ముజిబ్‌ ఉల్‌ రహమాన్‌ అన్సారీ కూడా ఉన్నారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హెరాత్‌ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో మసీదు కిక్కిరిసిన సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.