చెత్త నిర్వహణలో విఫలమైన బెంగాల్ కు రూ. 3,500 కోట్లు జరిమానా

చెత్త నిర్వహణలో విఫలమైనందుకు గాను.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి రూ. 3, 500 కోట్ల జరిమానాను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జిటి) విధించింది. ఆరోగ్య సమస్యలను వాయిదా వేయలేమని, కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతనని ఎన్ జిటి ఛైర్ పర్సన్ జస్టిస్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 

మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా  వాటికి ప్రాధాన్యమివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్ లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు రూ. 12,818.88 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించింది. నిధుల కొరత చూపెడుతూ తమ బాధ్యతలను విస్మరించకూడదని సూచించింది.

నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ. 3,500 కోట్లను రెండు నెలల్లోగా బెంగాల్ ప్రభుత్వం జమ చేయాలని ఆదేశించింది. అర్బన్ ఏరియాల్లో రోజుకు 2,758 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోందని, కేవలం అందులో 1268 ఎంఎల్డి మాత్రమే శుద్ధి చేయబడుతోందని వెల్లడించింది. 

వ్యర్థాల నిర్వహణ అంశంలో పర్యావరణ నిబంధన విషయాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వెల్లడించింది. ఘన, ద్రవ్య వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోనందున ఎన్జిటి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచైనా చెత్త నిర్వహణపై బెంగాల్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని సూచించింది. ఒకవేళ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.