అందరి శ్రేయస్సు కోరే మన సంస్కృతిలో అవయవదానం అంతర్భాగం

అవయవదానం, నేత్ర దానం అంశాలకు సంబంధించిన అంశాలు, సమస్యలు చర్చించి సమస్య పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ఏర్పాటైన  ‘స్వస్త్ సబల్ భారత్’  సదస్సును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభిస్తూ మానవతా దృక్పథంతో ప్రజలు అవయవ దానం చేసేలా చూసేందుకు ప్రజా ఉద్యమం ప్రారంభం కావాలని పిలుపిచ్చారు. 

‘వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు ఇతరుల శ్రేయస్సును ఆలోచించడం మన సంస్కృతిలో భాగంగా ఉంది. అవయవ దానం కూడా ఇటువంటి ఉదార ఆలోచనతో ముడిపడి ఉంది’ అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.  అవయవ దానం చేసేలా ప్రజలను ఒప్పించడం ప్రభుత్వం లేదా స్వచ్చంధ సేవా సంస్థలకు సాధ్యం కాదు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని మంత్రి తెలిపారు. 

అవయవ దానం కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూసేందుకు  తమ మంత్రిత్వ శాఖ అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

దధీచి దేహ దాన సమితి పోషకుడు అలోక్ కుమార్, దధీచి దేహ దాన సమితి అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా, భారతదేశంలో అవయవ/శరీర దానాలపై కృషి చేస్తున్న సీవోటెర్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్   యశ్వంత్ దేశ్‌ముఖ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు  డాక్టర్ సహజానంద, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజషన్ కి చెందిన డాక్టర్  రజనీష్ సహాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.