విశాఖలో కాలుష్య నియంత్రణకు కవర్‌ షెడ్ల నిర్మాణం

విశాఖపట్నం పోర్ట్ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడానికి అధునాతన కవర్ షెడ్ల నిర్మాణానికి సత్వర చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు.

విశాఖపట్నం ఓడరేవులో బల్క్ కార్గో ద్వారా కలిగే కాలుష్యాన్ని నియంత్రించడానికి పెద్దఎత్తున కవర్ షెడ్ల నిల్వ సదుపాయాన్ని ఏర్పాటు చేయవలసినదిగా ఆయన వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా ఓడరేవు చుట్టూ నివాసాలు విపరీతంగా పెరిగాయని, సాగరమాల ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కవర్ షెడ్‌ల నిర్మాణాన్ని చేపట్టి వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ద్వారా పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టవచ్చని జీవీఎల్ సూచించారు.

కాలుష్యం, దుమ్ము ధూళిని నియంత్రించడానికి ప్రణాళికను రూపొందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.  అభివృద్ధిలో ఉన్న కవర్ స్టోరేజ్ మౌలిక సదుపాయాల గురించీ ఆయన ప్రస్తావించారు. కవర్ స్టోరేజ్, ఇతర ఏర్పాట్లూ అత్యాధునికంగా ఉండేలా చూడాలని ఎంపీ జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు. ప్రజారోగ్యం, పోర్ట్ కార్యకలాపాలకు సంబంధించిన అంశాల గురించీ ఆయన వివరించారు.

కేంద్ర ప్రభుత్వ మద్దతు విశాఖపట్నం ఓడరేవు కార్యకలాపాలను మెరుగుపరుస్తుందని, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుందని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. కాలుష్య రహిత ఓడరేవు కార్యకలాపాలకు ప్రధానమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని సర్బానంద సోనోవాల్ చెప్పుకొచ్చారని సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. తాను చేసిన విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని జీవీఎల్ తెలిపారు.