బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎంపిక లాంఛనమేనా!

మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ మూలాలున్న రిషి సునాక్, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌లమధ్య బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి తీవ్రస్థాయిలో జరిగిన పోటీలో బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎంపిక కావడం ఇక లాంఛనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రచారం, డజనుకు పైగా సభలు, మూడు టెలివిజన్‌ డిబేట్‌ల ఫలితాలతో లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ ప్రధాని కానున్నారని స్పష్టమవుతుంది. ఆమె ఎన్నికయితే యుకెకు మూడో మహిళా ప్రధాని అవుతారు. రిషి సునాక్ ఎన్నికయితే శ్వేత జాతీయుడు కాని మొదటి ప్రధానిగా చరిత్ర సృష్టిస్తారు.

శుక్రవారంతో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓటింగ్‌ కూడా ముగిసింది. ఈ ఫలితాల్లో కూడా లిజ్‌ ట్రస్‌ గెలిచే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు గట్టి పోటీ ఇచ్చిన రిషి సునాక్‌ కొంత వెనుకంజలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాని ఎన్నిక  కోసం  ఆగస్టు నుంచి పోస్టల్‌, ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన ఓటింగ్‌  శుక్రవారం 5 గంటలకు ముగిసింది.

ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం తన రాజీనామాను క్వీన్‌ ఎలిజిబెత్‌-2కు సమర్పించకముందే ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.   విజేతలు బ్రిటన్‌ రాణి అనుమతితో ప్రధాని పదవి చేపట్టనున్నారు. 

అనారోగ్య సమస్యల కారణంగా ఎలిజబెత్‌ రాణి ఈసారి లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి కాకుండా స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ కోట నుంచి తదుపరి ప్రధానిని ప్రకటిస్తారు. రాణి ప్రస్తుతం ఈ కోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవారు పలు సవాళ్లను ఎదుర్కొవాల్సి వుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  అక్టోబర్‌ , జనవరి  మధ్య   ఆహారంతో పాటు చలిని ఎదుర్కొనేందుకు వినియోగించే ఖర్చులు 80 శాతం పెరగనున్నాయని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.

తాను అధికారం చేపడితే పన్నులను గణనీయంగా తగ్గిస్తానని ఇప్పటికే ట్రస్‌ హామీ ఇచ్చారు. అయితే పన్నుల తగ్గింపుతో ప్రజలకు ఎటువంటి లబ్థి చేకూరదని అంటున్నారు.