శ్రీలంకకు తిరిగి చేరుకున్న గొటబయ రాజపక్సే 

దేశం నుండి పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే తిరిగి శ్రీలంకకు చేరుకున్నారని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన రాజపక్సేకు పలువురు మంత్రులు, రాజకీయ నేతలు పూలతో స్వాగతం పలికినట్లు ఆ అధికారి తెలిపారు.

బ్యాంకాక్‌ నుండి సింగపూర్‌ మీదుగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో దేశానికి  చేరుకున్నట్లు తెలిపారు.  వర్చువల్‌ ఖైదీగా థారు హోటల్‌లో ఉన్న రాజపక్సే దేశంలోకి తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించాల్సిందిగా తన వారసుడు, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘేను అభ్యర్థించినట్లు సమాచారం.

ఆయనకు  భద్రతను కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు  రక్షణ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం ఖర్చులు పెరిగిపోయాయి. ఈ సంక్షోభానికి రాజపక్సే సోదరులే కారణమంటూ ప్రజలు కొన్ని నెలల పాటు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రజలు ఆగ్రహంతో అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో మిలటరీ సాయంతో రాజపక్సే దేశం నుండి పారిపోయారు. మొదట మాల్దీవుల్లో తలదాచుకున్న రాజపక్సే అక్కడి నుండి సింగపూర్‌, తర్వాత థారులాండ్‌కు చేరుకున్నారు. అయితే 90 రోజులు ఉండేందుకు మాత్రమే థారులాండ్‌ ప్రభుత్వ అనుమతి ఇచ్చింది.