ప్రతిపక్షాలలో కలకలం సృష్టిస్తున్న కేసీఆర్ బీహార్ పర్యటన 

బీజేపీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జరిపిన బీహార్‌‌ పర్యటన ప్రతిపక్ష శిబిరంలో కలకలం రేపింది. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి ఆయన పాట్నాలో నిర్వహించిన విలేకరుల సమావేశం ప్రకంపనలు సృష్టిస్తోంది.

కేసీఆర్ తో కలసి వేదిక పంచుకోవడం రాజకీయంగా ఆత్మహత్యా సాదృశ్యం కావచ్చనే ఆందోళనలు వారిలో వ్యక్తం అవుతున్నాయి. అందుకనే అనుకుంటా, గతంలో రెండుసార్లు సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో కేసీఆర్ ను కలిసినా, ఉమ్మడిగా మీడియా ముందుకు రావడానికి విముఖత వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిత్వంపై నితీశ్‌కుమార్‌ను కేసీఆర్ ఇరుకునపెట్టారంటూ జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

నితీశ్‌ను అవమానించేందుకు కేసీఆర్ బీహార్ వెళ్లారా? అంటూ బీహార్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉంటే బీహార్ బీజేపీ నేతలు కూడా కేసీఆర్ విలేకరుల సమావేశంను ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్, నితీశ్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని స్వయంగా కేసీఆరే ఒప్పుకొలేదని చెప్పారు. 

కాగా, 2024 కంటే ముందు 2023లో రాబోయే ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోతారని సుశీల్ కుమార్ మోదీ జోస్యం చెప్పారు. 2023లో నెగ్గితే అప్పుడు ప్రధాని అభ్యర్థిత్వం సంగతి చూద్దామని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశం నుంచి వెళ్లిపోదామని నితీశ్ అంటుంటే కూర్చొండంటూ కేసీఆర్ బతిమాలారని సుశీల్ మోదీ గుర్తు చేశారు. 

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా కేసీఆర్ పర్యటనను అవహేళన చేశారు. కేసీఆర్ వచ్చింది నితీశ్‌ను ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాదని, కేసీఆర్ పర్యటన లక్ష్యం బీజేపీ ముక్త్ భారత్ కాదని, హిందూ ముక్త్ భారత్ అని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు.

వాస్తవానికి పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీయేతర పక్షాల ప్రధాని అభ్యర్ధిగా నితీశ్‌ను ప్రతిపాదిస్తారా? అని ఓ విలేకరి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆయనను ప్రతిపాదించడానికి తానెవర్ని అని కేసీఆర్ విలేకరిని తిరిగి ప్రశ్నించారు. ఈ క్రమంలో నితీశ్ అసహనంగా తాను కూర్చున్న కుర్చీలోనుంచి లేచి నిల్చున్నారు. 

ఆ వెంటనే ఆయన పక్కనే ఉన్న తేజస్వీ యాదవ్ కూడా నిల్చున్నారు. అయినా విలేకరులు ప్రశ్నలు అడుగుతునే ఉన్నారు. ఆ సమయంలో కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు జవాబు చెబుతూనే కూర్చోమని నితీశ్‌ను బతిమాలారు. ఒకసారి కాదు రెండుసార్లు ఏకంగా 15 సార్లు బతిమాలారు. అయినా నితీశ్ కూర్చోలేదు. 

ఆ ప్రశ్న వచ్చినప్పుడల్లా నితీష్ అసహనంతో “ఇక చాలు వెళదాం పదండి” అని లేవడం, “ప్లీజ్ కొద్దీ సేపు కూర్చోండి” అంటూ కేసీఆర్ ప్రాధేయపడటం మీడియా ముందే జరుగుతూ వచ్చింది. చివరకు 16వ సారి మళ్లీ రిక్వెస్ట్ చేశారు. 

“ప్లీజ్ నితీశ్ గారు కూర్చొండి. విలేకరుల సమావేశం ఐదు నిమిషాల్లో ముగించేస్తా”నని చెప్పారు. అప్పుడు నితీశ్ కూర్చునేందుకు అంగీకరించారు. అక్కడకు “వారు (మీడియా) మిమ్ములను ఇరికించాలని చూస్తున్నారు” అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు. అయితే,     నితీశ్ కూర్చున్న కాసేపటికే కేసీఆర్ విలేకరుల ప్రశ్నలకు జవాబులు చెప్పి సమావేశం ముగించేశారు. 

ఈ మీడియా సమావేశం ముందుగా నితీష్ అనుకున్న కార్యక్రమంలో లేదని, అకస్మాత్తుగా కేసీఆర్ తీసుకు వచ్చారని తెలుస్తున్నది. ఇద్దరు ముఖ్యమంత్రులకు జాతీయ స్థాయిలో `చక్రం’ తిప్పాలని ఆశలు ఉండడంతో ఎవ్వరికీ వారుగా మరొకరికి ఎక్కడ ప్రాధాన్యత వస్తుందో అంటూ జాగ్రత్త పడే ప్రయత్నం కనిపించింది. 

మరోవంక, తెలంగాణలోని బిజెపి నేతలు ఏమో తెలంగాణ పరువును పాట్నాలో మంటగరిపారని, అక్కడ నితీష్ కుమార్ ముందు కేసీఆర్ అవమానంకు గురయ్యారని అంటూ ధ్వజమెత్తుతున్నారు. “కేసీఆర్ నాయకత్వాన్ని స్పష్టంగా నితీష్ వ్యతిరేకించారు” అంటూ ఎద్దేవా చేస్తున్నారు.