సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన

లివ్‌ ఇన్‌ రిలేషన్‌షి్‌పగా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువ కావడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.  కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

వస్తువులను వినియోగించి..అనంతరం పారవేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’ విధానాన్ని అవలంబిస్తున్నారని విచారం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లపాటు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు కలిగిన అనంతరం ఓ వ్యక్తి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య తనను వేధింపులకు గురి చేస్తోందని, అందువల్ల విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దానిని ఆ కోర్టు తిరస్కరించింది. అనంతరం ఆయన హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ముహమద్‌ ముస్తాకీ, జస్టిస్‌ సోఫీ థామ్‌సల ధర్మాసనం పరిశీలించింది. ఆ వ్యక్తి చేసిన వినతిని కొట్టి వేస్తూ కుటుంబ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  ‘‘నేటి తరం పెళ్లిని ఓ కీడుగా భావిస్తోంది .బాధ్యతలు, జవాబుదారీతనం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి అదొక ఆటంకమని అనుకుంటోంది. వైఫ్‌- డబ్ల్యు ఐ వై ఎఫ్‌- అంటే ‘వర్రీ ఇన్‌వైటెడ్‌ ఫర్‌ ఎవర్‌’ అని అర్థం చెప్పుకొంటోంది” అంటూ ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.

పాత అర్థమయితే ‘వైజ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫర్‌ ఎవర్‌’ అని పేర్కొంటూ ఎప్పుడంటే అప్పుడు గుడ్‌ బై చెప్పడానికి వీలుగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌షి్‌పలు పెరుగుతున్నాయని తెలిపింది. దేవుని సొంత భూమిగా పేరుపొందిన కేరళలో ఒకప్పుడు బంధాలు పెనవేసుకుపోయిన కుటుంబాలు ఉండేవని, కానీ ఇప్పుడు వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విడాకులు తీసుకోవడం ట్రెండ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

వివాహాన్ని పవిత్రమైన కార్యంగా భావించే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోందని చెబుతూ అది వ్యక్తుల శారీరక వాంఛలు తీసుకునేందుకు పొందే లైసెన్సు మాత్రం కాదని స్పష్టం చేసింది. భార్య, పిల్లలను వదిలించుకోవడానికే విడాకులు తీసుకోవాలనుకోవడం తగదని మందలించింది.

వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడాన్ని భరించలేకే ఆమె భర్తతో పోట్లాడుతోందని చెబుతూ దీనిని వికృత ప్రవర్తనగా భావించకూడదని హితవు చెప్పింది. ఆయన తల్లి కూడా కుమారుని ప్రవర్తనపై అసంతృప్తితో ఉన్నారని గుర్తు చేసింది. భర్త తిరిగి వస్తే కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెబుతోందని అంటూ అందువల్ల విడాకులవ్వడానికి కారణాలు లేవని  దర్మాసనం స్పష్టం చేసింది.