దేశంలో అదుపులోనే కరోనా వ్యాప్తి

 దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు పదివేల లోపే నమోదవుతున్నాయి. తాజాగా గురువారం 24 గంటల వ్యవధిలో దాదాపు 8 వేల కేసులు నమోదవ్వగా, క్రియాశీల కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. 
 
అంతకు ముందు 24 గంటల్లో 2.66 లక్షల పరీక్షలు చేయగా, 7946 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతంగా ఉంది. క్రితం రోజు 7231 కేసులతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో 9828 మంది వైరస్ నుంచి కోరుకున్నారు. 
 
ఇప్పటివరకు 4.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, రివకరీ రేటు 98.67 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 0.14 శాతానికి తగ్గింది. ఇక బుధవారం మరో 12.90 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు 212.52 కోట్ల డోసులు పంపిణీ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

బూస్టర్ డోసు త్వరగా తీసుకోండి

కాగా, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న దృష్టా ముందుగా తీసుకున్న వ్యాక్సిన్ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు) తీసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా సూచించారు. 
 
వివిధ రకాల వైరస్‌లతోపాటు కరోనా  కూడా వ్యాప్తిలో ఉంది. అయితే అదృష్టవశాత్తు తీవ్ర ప్రభావాన్ని చూపించక పోవడంతో పాటు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ మన చుట్టూ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మరిచిపోవద్దని అరోరా హెచ్చరించారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90 శాతం మంది బూస్టర్ తీసుకోని వారేనని అరోరా గుర్తు చేశారు.