జమ్మూకశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో బుధవారం రాత్రి జరిగిన  ఎన్‌కౌంటరులో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు  హతం అయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోరీ ప్రాంతంలోని బొమ్మై వద్ద కేంద్ర భద్రతా బలగాలకు, జైషే మహ్మద్ ఉగ్రవాదులకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. 
 
జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలతో కలిసి ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా వారు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, మరో పౌరుడికి గాయాలయ్యాయి.
 
ఓ పౌరుడిపై దాడికి ఉగ్రవాదులు పథకం పన్నారని, దాన్ని తాము విఫలం చేశామని పోలీసులు చెప్పారు. మరణించిన వారిని జైషేమహ్మద్ గ్రూపునకు చెందిన మహమ్మద్ రఫీ (సోపోరి), కైసర్ అష్రఫ్ (పుల్వామా)లుగా గుర్తించారు. మరణించిన ఉగ్రవాదులు గతంలో పలు నేరాల్లో నిందితులని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.