దీపావళికల్లా మెట్రో నగరాలలో రిలయన్స్‌ 5జీ

5జీ టెలికం సర్వీసులను అక్టోబర్‌లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ‘సిసలైన పాన్‌–ఇండియా 5జీ నెట్‌వర్క్‌ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ప్రకటించారు.

అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్‌ సెన్సర్స్‌ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్‌ కోసం 5జీ సొల్యూషన్స్‌ రూపొందించేందుకు చిప్‌ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు.

అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్‌ 5జీ నెట్‌వర్క్స్‌లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

వినియోగ ఉత్పత్తుల విభాగంలోకి 

ఇప్పటికే సోలార్‌ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్‌ సెల్స్‌ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్‌ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు  ముకేశ్‌ అంబానీ కుమార్తె, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) డైరెక్టర్‌ ఈశా అంబానీ తెలిపారు.   తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు.

‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్‌లో కొనుగోళ్లకు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు.