వరదల వేళ భారత్ తో వాణిజ్య పునరుద్దరణకై పాక్ ఆరాటం 

రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల బారిన పడి  అల్లాడుతున్న పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించనున్నట్టు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారంనాడు తెలిపారు. 

వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్‌తో వ్యాపార మార్గాలను పునరుద్ధరించనున్నామని మంత్రి చెప్పినట్టు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ఏడాది జూలై నుంచి అసాధారణ రుతుపవనాల కారణంతో పాకిస్థాన్‌‌‌ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. దేశంలోని 3.3 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడినట్టు పాక్ పత్రిక ‘డాన్’  ఒక కథనం ప్రచురించింది.
 ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా ఏజెన్సీల సహకారంతో మానవతా సహాయక చర్యలు చేపడుతున్నట్టు క్లైమైట్ ఛేంజ్ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. ఎనిమిది వారాలుగా కురుస్తున్న వర్షాలను దేశంలో మునుపెన్నడూ చూడలేదని పేర్కొన్నారు.
నౌషెరాలోని కాబూల్ నదిలో వరద స్థాయితో పాటు ఇండస్ వరద నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉందని చెప్పారు. ఆహార, ఔషధ సరఫరా కూడా కష్టంగా మారుతోందని, ఎన్‌డీఎంఏ, పాకిస్థాన్ ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
ఎన్‌డీఎంఏ తాజా గణాంకాల ప్రకారం, ఈ వర్షాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి వర్షాలు, వరదల కారణంగా 1,061 మంది మృత్యువాత పడ్డారు. 1,575 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో, 11 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు సహా 29 మంది మృతి చెందగా, 48 మంది గాయపడ్డారు. 9,92,871 ఇళ్లు, 170 వంతెనలు, 157 దుకాణాలు ధ్వంసమయ్యాయి.
 
ప్రధాని మోదీ ఆందోళన 
 
పాకిస్థాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి తాను బాధపడ్డానని, త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెలిపారు.

“పాకిస్తాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డాను. ఈ ప్రకృతి వైపరీత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, బాధిత వారందరికీ మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.  త్వరగా సాధారణ స్థితిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నాము” అని ప్రధాని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. .

వాణిజ్య వర్గాల ఒత్తిడి 
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటుండడంతో పాకిస్థాన్ లోని వాణిజ్య వర్గాల నుండి కొద్దీ రోజులుగా భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవాలనే వత్తిడులను అక్కడి ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. పాకిస్తాన్ లోని అతిపెద్ద వ్యాపార సమ్మేళనం ఛైర్మన్ మియాన్ మొహమ్మద్ మన్షా గత వారం ​​ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ – పాకిస్థాన్  వాణిజ్య సంబంధాలను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఇతరత్రా సంబంధాల మెరుగుదలకు ఇది దోహదపడగలదని కూడా పేర్కొన్నారు. 

పుల్వామా ఉగ్రవాద దాడి, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తరువాత, 2019 నుండి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ నూతన ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఇప్పటికే ఒకడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు.
పాక్ కొత్త ప్రధానికి మన ప్రధాని మోదీ పంపిన శుభాకాంక్షలకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీకి లేఖ వ్రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు:  “…పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతియుత, సహకార సంబంధాలు మనప్రజలు, ప్రాంతం పురోగతి, సామాజిక ఆర్థిక పురోగమనానికి అత్యవసరం”.

 సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా దురుద్దేశపూరిత ఉద్దేశ్యంతో కవ్వింపు చర్యలకు దిగుతున్న పొరుగువారితో వ్యాపారాన్ని నిర్వహించలేమనే వాదనను భారత్ చేస్తూ వస్తున్నది.  “మమ్మల్ని అస్థిరపరచాలనుకునే వారికి మనం ఉపకారం చేయలేము” అని స్పష్టం చేస్తున్నాము. అయితే సుమారు సంవత్సరం కాలంగా రెండు దేశాల సరిహద్దుల్లో దాదాపు కాల్పుల విరమణ అమలులో ఉంటూ, ఓ విధమైన ప్రశాంతత కొనసాగుతున్నది.

 పొరుగునే ఉన్న మిత్రదేశం చైనా మాత్రం ఇప్పటిదాకా వరదలపై సంఘీభావ ప్రకటనలతోనే సరిపెట్టింది. ఆదివారం చైనా విదేశాంగ చేసిన ప్రకటనలో.. కనీసం వరదలపై మాట వరసకైనా ఆర్థిక సాయం, ఇతర సాయం ప్రస్తావన లేదు. చైనా విదేశాంగతో పాటు ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రకటనలు రాకపోవడంపై ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పైగా అప్పులు ఇవ్వడంలో చూపించే ఆసక్తి.. సాయం  విషయంలో ఏదంటూ మండిపడుతున్నారు పాక్‌ నెటిజన్స్‌.