ప్రజలందరికీ ఆరోగ్యం లక్ష్యంగా ఔషధ పరిశోధనలు చేపట్టాలి 

భారతీయ పరిశ్రమలు నిరంతరం నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయని కొనియాడుతూ వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ప్రజల  ఆరోగ్యం మరియు సంక్షేమం  లక్ష్యంతో ఔషదాలు ఉత్పత్తి చేయాలని, వినూత్న పరిశోధనలను చేపట్టాలని   కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  సూచించారు.
 
ఢిల్లీలో జరిగిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రజతోత్సవ వేడుకలలో పాల్గొంటూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన ఔషధాలు సకాలంలో, సరసమైన ధరలకు లభించేలా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కృషి చేస్తున్నదని ప్రశంసించారు.
 
భారత ఔషధ ఉత్పత్తి సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని డాక్టర్ మాండవీయ హామీ ఇచ్చారు. ఫార్మా రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పిఎల్ఐ 1,  పిఎల్ఐ 2 పధకాలను ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాల వల్ల కీలకమైన ఏపిఐల స్వదేశీ తయారీ ప్రారంభమైందని మంత్రి పేర్కొన్నారు. .
 
కరోనా సంక్షోభ సమయంలో భారతీయ ఫార్మా కంపెనీల నుంచి ప్రభుత్వానికి అందిన సానుకూల సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారం, సహకారం అవసరమని చెప్పారు. 
 
 ఈ రోజు ప్రారంభించిన రెండు అప్లికేషన్‌లతో రాబోయే సంవత్సరాల్లో   నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ   తన పనిని మరింత సాఫీగా, సమర్ధవంతంగా కొనసాగించగలదని ఆయన తన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా  ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2.0 (IPDMS 2.0), ఫార్మా సాహి దామ్ 2.0 యాప్‌ను ప్రారంభించారు.

నవీకరించిన  ఫార్మా సాహి దామ్ 2.0 యాప్  స్పీచ్ రికగ్నిషన్ వంటి  సౌకర్యాలు  కలిగి ఉంటుంది.  హిందీ మరియు ఆంగ్లంలో యాప్ అందుబాటులో ఉంటుంది. షేర్ బటన్, బుక్‌మార్కింగ్ సౌకర్యాలను కూడా దీనిలో కల్పించారు.  వినియోగదారుల ఫిర్యాదుల నిర్వహణ మాడ్యూల్ ద్వారా వినియోగదారు ఫిర్యాదులను ప్రారంభించే సదుపాయాన్ని కూడా యాప్  కలిగి ఉంది. యాప్ iOS ఆండ్రాయిడ్  వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

‘ యాన్ ఓవర్‌వ్యూ ఆఫ్ డ్రగ్ ప్రైసింగ్ @ NPPA 25 ఇయర్ ఒడిస్సీ’ అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.  25 సంవత్సరాల నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సాధించిన విజయాలు, అమలు చేసిన చర్యలు, ధరల నియంత్రణకు అమలు చేసిన  ప్రత్యేక చర్యలు,  దేశంలో ఔషధ నియంత్రణ వ్యవస్థయొక్క పరిణామం తదితర అంశాలను దీనిలో పొందుపరిచారు. 

ఎన్‌పిపిఎ ఛైర్మన్‌ కమలేష్‌ పంత్‌ స్వాగతోపన్యాసం చేశారు.  కేంద్ర రసాయన, ఎరువులు, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా,   ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ, ఎన్‌పిపిఎ మెంబర్ సెక్రటరీ డాక్టర్ వినోద్ కొత్వాల్ పాల్గొన్నారు.