గవర్నర్ పై దాడికి కన్నూర్ వర్శిటీ విసి కుట్ర 

 కేరళ లోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్  ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు.  పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న సమయంలో యూనివర్శిటీకి వచ్చిన తనపై డిసెంబర్, 2019లో  దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వీసీ గోపీనాథ్ రవీంద్రన్ కూడా ఉన్నారని అయన పేర్కొ న్నారు. 

కన్నూర్ నూతన వీసీ నియామకం విషయంలో గవర్నర్‌కు అధికార సీపీఎంకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో  వీసీ తీరుపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఈ విధంగా మాట్లాడారు. “ వీసీనే నన్ను యూనివర్శిటీకి ఆహ్వానించారు. నాపై భౌతిక దాడి జరిగే సమయంలో ఆయన బాధ్యత ఏమిటి? పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా? కానీ ఆయన అలా చేయలేదు. కేవలం రాజకీయ కారణాల వల్లనే ఆయన వీసీ స్థానంలో కూర్చున్నారు” అని గవర్నర్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు.

ఆ ఘటనపై యూనివర్శిటీ నుంచి రాజ్‌భవన్ పూర్తి వివరణ కోరినా ఆయన స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడిన కేరళ గవర్నర్ విసీ ప్రవర్తనపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నా కూడా తాను తీసుకోలేదని తెలిపారు.

కానీ క్రమశిక్షణ, మర్యాద విషయంలో ఆయన అన్ని పరిధులు దాటడం వల్లే ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. ఈ కుట్రకు ఢిల్లీలోనే పధకం రూపొందించినట్లు ఆ తర్వాత ఉన్నతాధికార వర్గాల ద్వారా తనకు తెలిసినట్లు ఆయన ఆరోపించారు. ఓ విసిగా  కాకుండా, ఓ అధికార పార్టీ కార్యకర్తగా విసి వ్యవహరించారని మండిపడ్డారు.

అతని సహాయంలో అనేక మందిని అక్రమంగా నియమించారని చెబుతూ గత రెండు, మూడేళ్ళలో జరిగిన అక్రమ నియామకాలపై తాను విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు.