మూడేళ్లలో ఏడు కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలుగా తెలంగాణ, గోవా నిలిచాయి. గోవా గత మూడేళ్లలో రూ 200 కోట్లకు పైగా ఖర్చుతో 2.63 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. 

ఈ సందర్భంగా గోవా ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ. మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు.  దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన మైలురాయిని చేరుకున్నట్టు వెల్లడించారు. 

దేశాన్ని పట్టించుకోని వాళ్లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపించరని ప్రధాని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభమేనని, కానీ దేశాన్ని నిర్మించే బాధ్యతను బీజేపీ ఎంచుకుందని, ఇందుకు చాలా హార్డ్‌‌‌‌ వర్క్‌‌‌‌ అవసరమని ఆయన చెప్పారు.

‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ దేశాన్ని నిర్మించాలంటే హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం” అని ప్రధాని తెలిపారు. నీటి సరఫరా చేస్తామంటూ, నీటిని సంరక్షిస్తామంటూ కొందరు పెద్ద పెద్ద హామీలిస్తారని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పని చేయరని పరోక్షంగా ప్రతిపక్షాలపై ప్రధాని ధ్వజమెత్తారు.

ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నీటి వసతి కల్పించేందుకు ఎంతో కృషి చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘ఇయ్యాల దేశంలోని 10 కోట్ల ఇండ్లకు పైప్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా మంచి నీళ్లను సరఫరా చేస్తున్నాం. ఇంటింటికీ నీళ్లివ్వాలనే ప్రభుత్వ కార్యక్రమంలో అతిపెద్ద విజయమిది. సబ్‌‌‌‌ కా వికాస్‌‌‌‌కు గొప్ప ఉదాహరణ ఇది” అని చెప్పుకొచ్చారు. 

‘‘7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో కేవలం 3 కోట్ల ఇండ్లకు మాత్రమే నీటి కనెక్షన్ ఉన్నది. కానీ గత మూడేండ్లలో 7 కోట్ల గ్రామీణ కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం” అని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నీటి భద్రత ఒకటని చెబుతూ ‘విక్సిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశగా సాగుతున్న దేశానికి ఇది పెను సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ అంకితభావాన్ని తెలియచేస్తుందని ఆయన చెప్పారు. పనాజీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో 52% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందుతోందని కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించినప్పుడు గ్రామాల్లోని 3.23 కోట్ల (16.90%) కుటుంబాలకు మాత్రమే పైపు నీటి కనెక్షన్‌ అందుబాటులో ఉంది.

 తెలంగాణ సహా మూడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% కవరేజీని కలిగి ఉన్నాయి. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్‌లో ఉంది.