ఎక్సైజ్ పాల‌సీ ప్ర‌ధాన సూత్ర‌ధారి అర‌వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలను ప్రస్తావిస్తూ ఈ  ఎక్సైజ్ పాల‌సీ కుంభకోణంలో మ‌నీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ కుంభకోణం ప్ర‌ధాన సూత్ర‌ధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అని  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన ఆరోపణలు చేశారు.

కేజ్రీవాల్ మీడియా ముందుకు వ‌చ్చి 24 గంట‌ల్లోగా త‌న‌కు జవాబివ్వాల‌ని అనురాగ్ ఠాకూర్ స‌వాల్ విసిరారు. సిసోడియాకు కేవ‌లం డబ్బు వ్యామోహంతో మనీ తీసుకుని మౌనంగా ఉంటున్నాడ‌ని, మనీశ్‌ సిసోడియా తన పేరును ‘మనీ-ష్‌’గా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు. విలేక‌రుల స‌మావేశానికి హాజ‌రైన మ‌నీష్ సిసోడియాకు ముఖం చెల్ల‌లేద‌ని, మీడియా అడిగిన ప్ర‌శ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు.

కేజ్రీవాల్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని చెబుతూ ఓ అవినీతి పరుడు ఎన్ని సార్లు కొట్టిపారవేసినా అతని అవినీతి ఎక్కడికి పోదని చెప్పారు. ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు అందించిన రోజుననే మద్యం విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెనుకకు తీసుకున్నదని ఠాకూర్ గుర్తు చేశారు. తన మంత్రి సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లినప్పటికీ అతనిని పార్టీ నుండి కేజ్రీవాల్ బహిష్కరింపలేదని విమర్శించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ  ‘‘మొదట సీబీఐ ఏం చేసినా అది చట్టం ప్రకారమే చేస్తుందని స్పష్టం చేశారు. ఇంతకు ముందు  సత్యేందర్‌ జైన్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు సీఎం కేజ్రీవాల్‌ ‘హార్డ్‌కోర్‌ హానెస్ట్‌ మ్యాన్‌’ అని కితాబు ఇచ్చారని, అయితే  ఆయనకు క్రిమినల్‌ పూర్వరంగం ఉన్నట్లు  మనీలాండరింగ్‌లో పాల్గొన్న నేపథ్యం ఉన్నట్లు కోర్టు పేర్కొందని తెలిపారు. కోర్టు కూడా ప్రతీకార రాజకీయాలు చేస్తోందా? అని ప్రశ్నించారు.

బిజెపి అధికార ప్రతినిధి ఆర్‌పి సింగ్ మాట్లాడుతూ, “ఆప్ బాధితుల కార్డును ప్లే చేస్తోంది.  నిజమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. న్యూయార్క్ టైమ్స్ పోస్ట్‌కు సంబంధించినంతవరకు, పిఆర్ కసరత్తులు జరుగుతున్నాయని మాకు తెలుసు. పాఠశాలలకు రంగులు వేయడం ద్వారా మీరు మారారని అర్థం కాదు. విద్యా వ్యవస్థ నమూనా, ప్రధానోపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి.  ప్రతి సంవత్సరం 1 లక్ష కంటే ఎక్కువ మంది పిల్లలు చదువు ఆపివేస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్ అవినీతిని దాచడానికి ఆప్ చేస్తున్న ప్రచారం” అని విమర్శించారు.

బీజేపీ ఐటీ సెల్ అధిపేతి అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, విధానం బాగానే ఉంటే, విచారణకు ఆదేశించిన వెంటనే ఎందుకు తిప్పికొట్టారని ప్రశ్నించారు.

మరోవైపు.. ఆప్‌ నేతలు మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే బీజేపీకి నచ్చదంటూ  పేర్కొంటూ రానున్న లోక్‌సభ ఎన్నికలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతాయని సిసోడియా తెలిపారు. అందుకనే  కేజ్రీవాల్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలు మోదీ, కేజ్రీవాల్ మధ్య జరుగుతాయని సిసోడియా చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, ‘‘2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల నేత అరవింద్ కేజ్రీవాల్ అయితే బీజేపీకి మంచిదే. ఎందుకంటే చాలా మంది ఆయన పేరును సైతం వినలేదు. మేం చాలా గొప్ప ఆధిక్యంతో గెలుస్తాం’’ అని పేర్కొన్నారు.