కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేవారే లేరా

మూడేళ్లకు పైగా కాంగ్రస్ అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం నామినేషన్ల ఘట్టం ఆదివారం నుండి ప్రారంభం అవుతూ ఉండగా, ఇప్పటి వరకు ఎవ్వరూ నామినేషన్ వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ పార్టీలో సందిగ్ధత నెలకొంది. అనారోగ్యం కారణంగా ఆ పదవిలో కొనసాగడానికి  సోనియా గాంధీ విముఖంగా ఉన్నారు. 
 
2019 ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుండి మరెవ్వరిని అధ్యక్షునిగా నియమించలేదు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ నెల 28లోగా నామినేషన్ వేయవలసి ఉంది. ఆ పదవిని చేపట్టామని కాంగ్రెస్ వర్గాలు రాహుల్ గాంధీపై ఎంతగా వత్తిడి తెస్తున్నప్పటికీ ఆయన విముఖంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. 
 
కొందరి పార్టీ నాయకుల దృష్టి ప్రియాంక గాంధీపై పడిగా, గత ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సారధ్యం వహించిన ఆమె చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోవడం గమనార్హం.  ఏదో విధంగా రాహుల్‌ను ఒప్పించి తిరిగి గాంధీలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సోనియా గాంధీ కూడా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 
 
రాహుల్ గాంధీ అంగీకరించడం లేదని, అయినా తాము ఆయనను ఈ విషయంలో ఇప్పటికీ మెప్పించేందుకు అభ్యర్థిస్తున్నామని కాంగ్రెస్ ప్రముఖులు భక్త చరణ్ దాస్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఆయన తమ వైఖరిని స్పష్టం చేయాలని. ఈ కీలక బాధ్యతల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా చెప్పాల్సి ఉందని దాస్ రాహుల్‌ను విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు రాహుల్ అత్యంత ముఖ్యమైన నిర్ణయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. జమ్మూ కశ్మీరు కాంగ్రెస్ కమిటీని పునర్నిర్మించే నిర్ణయానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. 
 
అయితే, మోదీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రజలలోకి వెళ్లడం ద్వారా తానే కాంగ్రెస్ నేతను అనే సంకేతం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  పలు కీలక అంశాలపై ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతున్నారు. సెప్టెంబర్‌లో ఓ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారు. బాధ్యత వహించకుండా అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఈ సందర్భంగా విమర్శలు గుప్పిస్తున్నారు.