ఢిల్లీని వణికిస్తున్న కరోనా, ఫ్లూ జ్వరాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీని కరోనా, ఫ్లూ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా ఆన్‌లైన్ సర్వే చేయగా 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడ్డారని వెల్లడైంది. ఢిల్లీలో గడచిన మూడు వారాల్లోనే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
 
 గత 30 రోజుల్లో 10 ఇళ్లలో 8 ఇళ్లలోని ప్రజలు కొవిడ్, వైరల్ జ్వరాలతో అల్లాడుతున్నారని సర్వేలో తేలింది. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఢిల్లీవాసులు చాలామంది హోంటెస్ట్ కిట్స్ ద్వారా కరోనా, వైరల్ జ్వరాలా అనేది పరీక్షలు చేసుకుంటున్నారు.
కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే మిగతావారికి కూడా ప్రబలుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కోరారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 917 కరోనా కేసులు నమోదయ్యాయి.
20 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ముగ్గురు కరోనాతో మరణించారు. కరోనాకు తోడు ఫ్లూ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. పలవురు రోగులకు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, జలుబు సమస్యలతో బాధపడుతున్నారు.
ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ నగరాల్లో తాజాగా జరిపిన ఆరోగ్య సర్వేలో 80 శాతం ఇళ్లలో జ్వరపీడితులు ఉన్నారని తేలడంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఫ్లూ లాంటి వైరల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.