రాష్ట్రాలు బూస్టర్ డోసు క్యాంపుల నిర్వహణపై చొరవ చూపాలి 

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 17 శాతంమంది మాత్రమే బూస్టర్‌డోసు తీసుకున్నారని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు బూస్టర్ డోసు క్యాంపుల నిర్వహణపై చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుతాలను ఆయన కోరారు. 

రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ప్రికాషన్ డోసు కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. 

ప్రజారోగ్య సంరక్షణ, వైద్య రంగాలకు కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేటాయింపులు చేయడం, నిధుల వినియోగం తక్కువగా ఉండటం పట్ల మన్‌సుఖ్‌ మాండవియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రంగాలకు కేంద్ర ప్రభుత్వం తగిన కేటాయింపులు జరపడం లేదని, నిధుల వినియోగాన్ని బాగా తగ్గించేస్తోందన్న విమర్శలు చేసేముందు..రాష్ట్రాలే నిధుల పెంపుపై దృష్టి సారించాలని ఆయన సూ

దేశవ్యాప్తంగా బహుళ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను సృష్టించడం, విస్తరించడం, బలోపేతం చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి జిల్లా, బ్లాక్‌లలో సంరక్షణ మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మహమ్మారి మనకు నేర్పిందని తెలిపారు.

రాష్ట్రాల్లో కేంద్ర నిధుల వినియోగం తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్కువ నిధుల వినియోగాన్ని సమీక్షించే బదులు, రాష్ట్రాలు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని హితవు చెప్పారు. డిసెంబర్‌ 2022 వరకు ప్యాకేజీ అందుబాటులో ఉన్నందున ఈసిఆర్‌పి కింద కేంద్రం ఇప్పటికే ఆమోదించిన మొత్తం రూ. 23,123 కోట్ల నిధులను వెంటనే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, సూళ్లు, కాలేజీలు, ప్రార్థన స్థలాలు, పుణ్యక్షేత్రాల మార్గాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అర్హులందరూ ప్రికాషన్ డోసు డోసు తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.

64,89,99,721 మంది లక్ష్యిత జనాభాలో జులై 14 వరకు కేవలం 8శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. జులై 15 నుంచి ప్రభుత్వం 75 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, 18 ఏళ్లకు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 

74.5 కోట్ల మంది అర్హులుంటే ఆగస్టు 15 నాటికి కేవలం 17 శాతం మంది 12,36,03,060 కరోనా ప్రికాషన్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారని కేంద్ర మంత్రి మాండవీయ వివరించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అర్హులైన జనాభా బూస్టర్ డోసు తీసుకునేలా కరోనా వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

వ్యాక్సిన్ ఒక్కడోసు కూడా ఎక్స్‌పైరీ అవకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి మాండవీయ కోరారు.